ఏపీ విద్యార్థులకు, వారి తల్లులకు గుడ్ న్యూస్ చెప్పారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. ఇవాళ జగనన్న వసతి దీవెన విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 912.71 కోట్లు బటన్ నొక్కి జమ చేయనున్నారు . అనంతపురం జిల్లా నార్పలలో కంప్యూటర్ బటన్ నొక్కి ఆర్ధిక సాయాన్ని విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
అయితే, ఇవాళ జమ చేస్తున్న రూ. 912.71 కోట్లతో కలిపి జగనన్న వసతి దీవెన ద్వారా ఇప్పటి వరకు 25,17,245 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 4,275.76 కోట్లు జమ చేసింది వైఎస్ జగన్ ప్రభుత్వం. కాగా, ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున ఆర్ధిక సాయం చేస్తూ వస్తుంది ఏపీ ప్రభుత్వం.