ప్రస్తుత ఏపీ ప్రభుత్వం తిరుపతిని సర్వనాశనం చేసిందని సినీ నిర్మాత అశ్వినీ దత్ విమర్శించారు. ఇప్పుడక్కడ జరగని పాపం లేదని.. అక్కడ జరిగే అన్యాయాలను ఊహించలేమని వ్యాఖ్యానించారు. ‘సీతారామం’ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గురువారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.
‘చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తారన్న నమ్మకం ఉంది. వెయ్యికాళ్ల మండపం తొలగించినప్పుడు చినజీయర్ స్వామి ఆయన్ని తీవ్రంగా విమర్శించారు. ఆగమశాస్త్రం ప్రకారమే చంద్రబాబు ఆ మండపాన్ని తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి.. ఈ మూడేళ్ల కాలంలో తిరుపతిని సర్వనాశనం చేసింది. స్వామి ఇంకా ఆ పాపాలను ఎందుకు చూస్తున్నాడో అర్థం కావడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో బలవంతపు మతమార్పిళ్లు జరుగుతుంటే చినజీయర్ స్వామి ఎందుకు మాట్లాడటం లేదు? ఆయన ఆ మధ్య ఓ స్థూపం ఆవిష్కరణ సందర్భంగా జగన్‌ను దైవాంశ సంభూతుడని పొగిడారు. ఆ మాటలు వినగానే నాకు కడుపు మండిపోయింది. సమ్మక్క-సారక్క అంటే ప్రజల్లో ఎంతో విశ్వాసం. పొరుగు రాష్ట్రాల ప్రజలూ సమ్మక్క-సారక్కను దేవతలుగా నమ్ముతారు. వారిని ఆయన దేవతలు కాదనడం బాధ కలిగించింది’ అని అశ్వినీదత్ చెప్పారు.