దేశంలో క్రైమ్ రేట్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది కానీ తరగడం లేదు. సమాజంలో ఒక్కరి చేతిలో మరొక్కరు హత్యలకు గురవుతూనే ఉన్నారు. ఆస్తి తగాదాలతో, ప్రేమ వ్యవహారం, పాతకక్షలతో, అక్రమ సంబంధాల వ్యవహారాలతో ఇలా ఒక్కరి చేతిలో మరొక్కరు హత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా తిరుపతిలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపతిలోని టీడీపీ కార్యకర్తపై కత్తులతో గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఆదివారం రాత్రి సమయంలో దుండగుల దాడిలో భరత్ యాదవ్ కు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు అతడిని రుయా ఆసుపత్రికి తరలించారు. బాధితుడి రుయా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తిరుపతి తూర్పు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక భరత్ యాదవ్ పై దాడి చేసింది వైసీపీ కార్యకర్తలని ఆరోపణలు వస్తున్నాయి.
ఇక భరత్ యాదవ్ హత్యపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు నరసింహ యాదవ్ బంధువు భరత్ యాదవ్ హత్యను తీవ్రంగా ఖండించారు. వైసీపీ కార్యకర్తలు గత రాత్రి కత్తులతో దాడిచేసి గాయపర్చగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భరత్ యాదవ్ మృతిచెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. భరత్ యాదవ్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక తిరుపతిలో ఐదు హత్యలు జరగాయని ఆయన అన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిని రాజకీయ కక్ష సాధింపుల వేదికగా మార్చారన్నారు. ప్రశాంతమైన తిరుపతిని ఫ్యాక్షన్ ప్రాంతంగా మార్చడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భరత్ యాదవ్ హత్య శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, తిరుపతి ప్రశాంతతను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.