ఏపీలో అధికార వైసీపీ రాజకీయం మారుతోంది. పార్టీ నేతల మధ్య కుంపట్లు రాజుకుంటున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి వస్తోన్న నేతలను అంగీకరించని వైసీపీ నేతలు, మంత్రులు ధిక్కారస్వరాలు వినిపిస్తున్నాయి. జమ్మలమడుగు, చీరాల, పరుచూరు, రామచంద్రాపురంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ గొడవల జాబితాలోనే విశాఖ జిల్లా చేరింది. టీడీపీకి చెందిన సీనియర్ నేత, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 16వ తేదీన ఆయన వైసీపీలో చేరతారని వార్తలు వస్తున్నాయి.
విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాస్‌తో పాటు పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డితో పార్టీ బలపడదని నిర్ణయం తీసుకున్న సీఎం జగన్మోహన్ రెడ్డి తన ఛానెల్ ద్వారా గంటాను పార్టీలో చేర్చుకుంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే గంటా వైసీపీలో రావడం ఏ మాత్రం ఇష్టం లేని మంత్రి అవంతి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ సర్కారు మూడు రాజధానుల ప్రకటనతో తమ భవిష్యత్ రాజకీయ క్షేత్రంగా విశాఖను ఎంచుకున్నట్లు చెప్పకనే చెప్పింది. ఈ క్రమంలోనే భవిష్యత్తులో విశాఖలో మరింత బలంగా మారేందుకే జగన్ గంటాను పార్టీలో చేర్చుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
జగన్ విశాఖలో అడుగు పెట్టకముందే టీడీపీకి దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలన్న ప్లాన్‌తో పాటు రాజధానిలో తన బలం ఏంటో ఫ్రూవ్ చేసుకోవాలన్న కసితో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గంటాను పార్టీలో చేర్చుకునే విషయంలో పార్టీలో కొందరికి నచ్చకపోయినా కూడా జగన్ గంటాను పార్టీలో చేర్చుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే తనకు ఇష్టం లేకపోయినా గంటాను పార్టీలో చేర్చుకోవడాన్ని అవంతి జీర్ణించుకోలేకపోతున్నట్టు ఆయన మాటలే చెపుతున్నాయి. అవంతి గంటాపై ఉన్న కోపాన్ని కక్కేస్తున్నారు.
వాస్తవానికి వీరిద్దరు అత్యంత సన్నిహితులు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న గంటాకు అనకాపల్లి ఎంపీగా ఉన్న అవంతి మధ్య తీవ్రమైన గ్యాప్ వచ్చింది. అవంతి ఎలాగైనా మంత్రి కావాలనే ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చి భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మరీ మంత్రి అయ్యారు. ఇప్పుడు తన మాజీ గురువు రాకను ఆయన స్వాగతించలేకపోతున్నారు. జిల్లా రాజకీయాల్లో తన ఆధిపత్యానికి ఎక్కడ గండిపడుతుందో ? అని భావించిన అవంతి జగన్ అభీష్టానికి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తున్నారు.