తారక్ విషయంలో బాలయ్య నోరు నొక్కేస్తున్న బంధాలు, భయాలు ఇవే?

-

జూనియర్ ఎన్టీఆర్ కు బాలయ్య అంటే ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! మొదట్లో తన సినిమాల్లో… “మా బాబాయ్ ఎప్పుడూ చెబుతుండేవాడన్నా.. పురచేత్తో కొడితే పునర్జన్మ లేకుండా పోతావ్” అంటూ బాలయ్య డైలాగులని తన సినిమాలో పెట్టుకుని మురిసిపోయేవారు తారక్! ఇక ఆడియో ఫంక్షన్ లలో తన తాత పేరుతో పాటు బాలయ్య పేరును కూడా అదేస్థాయిలో ప్రస్థావిస్తూ.. తన తాత, తండ్రిలతో సమానంగా బాలయ్యను గౌరవిస్తూ వస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్! ఈ క్రమంలో మధ్యలో ఏమైందో ఏమో కానీ… జూనియర్ కు – బాలయ్యకు మద్య కాస్త గ్యాప్ వచ్చిందని కామెంట్లు వినిపించాయి. ఆ సంగతులు అలా ఉంటే… జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశంపై స్పందించారు బాలయ్య!

తాజాగా ఇచ్చిన ఇంటర్వూలో తారక్ రాజకీయ రంగప్రవేశంపై స్పందించిన బాలయ్య… “తారక్ కు సినిమా భవిష్యత్తు చాలా ఉంది. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది వాడి ఇష్టం. నాన్నగారు కూడా ఒకపక్క ముఖ్యమంత్రిగా ఉంటూనే మరోపక్క సినిమాలు చేశారు. నేను కూడా సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చాను. సినిమాలు వదిలేసి పాలిటిక్స్ లోకి రావాలా వద్దా అనేది వాడి ఇష్టం.” అని అన్నారు! ఇక్కడ సరిగ్గా గమనిస్తే… బాలయ్యకు జూనియర్ రాజకీయ రంగ ప్రవేశంపై “ఆసక్తి ఉన్నా, రమ్మని పిలిచే అవకాశం లేదు” అని అంటున్నారు విశ్లేషకులు! అందులో ఉన్న లాజిక్ ఏమిటో ఇప్పుడు చూద్దాం!

ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని ప్రతీ నందమూరి అభిమాని, టీడీపీ కార్యకర్త కోరుకుంటున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కొంతమంది టీడీపీ నేతలు కూడా ఎన్టీఆర్ రాకను బలంగా కోరుకుంటున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం పార్టీ ఉన్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ తప్ప మరో ఆప్షన్ లేదని.. ఇలానే బాబు – చినబాబు ద్వయంతో ముందుకు వెళ్తే కాలగర్భంలో కలిసిపోతామని అంటున్నారు. ఈ సమయంలో బాలయ్యకు మంచి అవకాశం వచ్చినట్లే… తన అన్న కొడుకుని “రాజకీయాల్లోకి రారా” అని అడిగే హక్కు బాలయ్యకు పూర్తిగా ఉంది.

బాలయ్యకు “చంద్రబాబు అంటే భయం లేకపోయినా, పెద్దల్లుడు అయిన చినబాబు రాజకీయ భవిష్యత్తుపై బెంగలేకపోయినా”… ఈ పని బాలయ్య ఎప్పుడో చేసేవారు. దీనికి “జూనియర్ ఎన్టీఆర్ అంటే ప్రేమే ఉండనవసరం లేదు.. తన తండ్రి స్థాపించిన పార్టీపైనా, ఆయన ఆశయాలపైనా ప్రేమ ఉంటే చాలు”! సినిమాల్లో నందమూరి తారకరామారావు జ్ఞాపకాలు ఎప్పుడూ పధిలమే. ఇదే క్రమంలో రాజకీయాల్లో కూడా ఆ మహానుభావుడి జ్ఞాపకాలు, ఆదర్శాలు సజీవంగా ఉండాలంటే పార్టీ కచ్చితంగా బ్రతికి ఉండాలి! ప్రస్తుత పరిస్థితుల్లో “ఐసీయూలో ఉన్న పార్టీకి ఆక్సిజన్ ఇచ్చి, ప్రాణాలు నిలబెట్టి బయటకు తెచ్చేవాడు కావాలి. అది జూనియర్ వల్లే అవ్వాలి”.

ఈ మాత్రం విషయం బాలయ్యకి తెలియదా… ఈ మాత్రం రాజకీయ జ్ఞానం, ప్రజాభిప్రాయంపై అవగాహన బాలయ్యకు లేవా… ఉన్నా కూడా “కొన్ని బంధాలు, మరికొన్ని భయాలు బాలయ్య నోరు నొక్కేస్తున్నాయి”! బుడ్డోడిని నోరు తెరిచి అడగలేని పరిస్థితిని కల్పిస్తున్నాయి!

Read more RELATED
Recommended to you

Latest news