బీజేపీ గేమ్ ప్లాన్‌.. జ‌గ‌న్ చిక్కుకుంటారా..?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి వ్యూహాలు ఉంటాయో చెప్ప‌డం క‌ష్టం. త‌మ‌కు అనుకూలంగా ఉంటే చాలు.. మార్గం ఏదైనా.. అనుస‌రించేందుకు పార్టీలు ఎప్పుడూ రెడీగానే ఉంటాయి. ఇప్పుడు ఏపీ విష‌యంలో కేంద్రంలోని బీజేపీ పెద్ద‌లు కూడా ఇలానే వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతున్నార‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి. గ‌తంలో త‌మిళ‌నాడులో అనుస‌రించిన వ్యూహాన్ని ఇక్క‌డ ఏపీలోనూ అమ‌లు చేయాల ‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి త‌మ వ్యూహం ఇక్క‌డ పారేలా బీజేపీ పెద్ద‌లు పావులు క‌దుపుతున్నార‌ని ఢిల్లీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తుండ‌డం గ‌మ‌నార్హం.

త‌మిళ‌నాడులో అప్ప‌టి సీఎం జ‌య‌ల‌లిత‌పై ఉన్న అవినీతి కేసుల‌ను ఉన్న‌ప‌ళాన వేగం పెంచారు.. ప్ర‌ధాని మోడీ. ఈ క్ర‌మంలోనే ఆమెపై ఏళ్ల త‌ర‌బ‌డి పెండింగులో ఉన్న కేసులు విచార‌ణ‌కు రావ‌డం.. కేసులు కూడా ఖ‌రారు కావ‌డం తెలిసిందే. అయితే, జ‌య‌ల‌లిత అప్ప‌టికే మ‌ర‌ణించారు. ఆ త‌ర్వాత ఆమె నెచ్చెలి శ‌శిక‌ళ‌ను జైలుకు పంపించి.. త‌మ‌కు అనుకూలంగా ఉంటార‌నే ప‌ళ‌ని స్వామిని సీఎం పీఠంలో కూర్చోబెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే కేంద్రం ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. త‌మిళ‌నాడు స‌ర్కారు నోరు మెద‌ప‌లేక పోతోంది.

విచిత్రం ఏంటంటే జ‌య‌ల‌లిత మ‌ర‌ణాంత‌రం బీజేపీ అన్నాడీఎంకేతో బ‌ల‌వంత‌పు పొత్తు పెట్టుకుంది. ఈ పొత్తు అన్నాడీఎంకేకు ఇష్టం లేక‌పోయినా క‌ష్టంగా అయినా పెట్టుకోక త‌ప్ప‌లేదు. మ‌రోవైపు చాప‌కింద నీరులా త‌మిళ‌నాడులో విస్త‌రించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ఇక‌, ఏపీ విష‌యంలోనూ ఇప్పుడున్న రాజ‌కీయాల‌ను మార్చాల‌ని బీజేపీ వ్యూహాత్మ‌కంగా పావులు క‌దుపుతోంద‌నేవ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం జ‌గ‌న్ స‌ర్కారు ఉంది. నిజానికి రాష్ట్రానికి ఎన్ని స‌మ‌స్య‌లు ఉన్న‌ప్ప‌టికీ కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌తో జ‌గ‌న్ స‌ర్దుకు పోతున్నారు. కానీ, ఇదొక్క‌టే బీజేపీ ఆశించ‌డం లేదు.

త‌మిళ‌నాడుకు మించి ఇక్క‌డ బీజేపీ ఎద‌గాలి.. స్వ‌యంగా స‌ర్కారును ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంద‌ని త‌ల‌పోస్తోంది. ఈ నేప‌థ్యంలోనే జ‌గ‌న్‌పై ఉన్న కేసుల‌ను అత్యంత వేగంగా విచార‌ణ పూర్తి చేసి.. ఆయ‌న‌ను జైలుకు పంపించాల‌ని చూస్తోంద‌ట‌. ఈ క్ర‌మంలోనే ఇదే పార్టీకి చెందిన ఒక అస‌మ్మ‌తినేత‌ను, త‌మ‌కు అనుకూలంగా ఇప్ప‌టికే మార్చుకున్న నాయ‌కుడిని ఏపీలో కీల‌క స్థానంలో పెట్టి.. తాము చ‌క్రం తిప్పాల‌ని భావిస్తున్న‌ట్టు ఢిల్లీలో ప్ర‌చారం జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం.

దీనికి పెద్ద‌గా స‌మ‌యం కూడా ప‌ట్ట‌ద‌ని.. వ‌చ్చే ఏడాదిలో అన్నీ చ‌క్క‌దిద్దుకుని.. ఏపీపై బీజేపీ దృష్టి పెడుతుంద‌ని అంటున్నారు. బీజేపీ ఎన్ని ప్ర‌ణాళిక‌లు… ప్ర‌య‌త్నాలు చేసినా అది ఏపీ విష‌యంలో… అందునా జ‌గ‌న్ విష‌యంలో ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతుందో ?  చూడాలి.