భారతీయ జనతా పార్టీకి కొత్త అర్థం చెప్పారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. బిజెపి అంటే.. బాబు – జగన్ – పవన్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రి కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన భారత సత్యాగ్రహ దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మునిగిపోతున్న నావగా పేర్కొన్నారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతుందన్నారు గిడుగు.
ఆంధ్రప్రదేశ్ లో గతంలో కాంగ్రెస్ పార్టీని వీడిన నేతలు అంతా తిరిగి రావాలని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికల నాటికి ఏపీ రాజకీయాలలో పెను మార్పులు వస్తాయన్నారు. ఇక మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికైనా పురోగతి కనిపిస్తుందన్నారు. మరోవైపు కర్ణాటకలో బిజెపి పతనం ఖాయం అని జోష్యం చెప్పారు గిడుగు. ఇందుకు నిదర్శనం బిజెపి నుండి భారీగా కాంగ్రెస్ పార్టీలోకి చేరికలేనన్నారు.