విజయవాడ వైసీపీలో చిత్రమైన విషయం చర్చకు వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నేతల నుంచి వైసీపీ సర్కారుపై ఎలాంటి విమర్శలు వచ్చినా.. వెంటనే రియాక్ట్ అయ్యే.. అధికార పార్టీ నేతలకు కొదవ లేదు. గతంలో మౌనంగా ఉన్న జోగి రమేష్ వంటి యువ నాయకులు కూడా టీడీపీకి గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. విషయం ఏదైనా కౌంటర్ వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు. అయితే, విజయవాడలో ఆ తరహా నాయకులు కనిపించడం లేదనే విమర్శలు సొంత పార్టీలోనే వినిపిస్తున్నాయి.
తాజాగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వరరావు తీవ్రస్థాయిలో సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. రాజధాని భూముల విషయంలో ఏసీబీ మాజీ ఏజీ.. దమ్మాలపాటి శ్రీనివాస్ సహా పలువురిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే, వీరంతా హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఈ విషయాలను ప్రస్తావిస్తూ.. బొండా ఉమా.. జగన్ ను టార్గెట్ చేసుకున్నారు. “రేపు ఏడాదిలోగా.. జగన్‌పై ఉన్న కేసుల విచారణ పూర్తయి.. ఆయన జైలుకు వెళ్తే.. మీ గతేంటని“ఆయన ప్రశ్నించారు.
సాధారణంగా.. పథకాలు, కార్యక్రమాలు, పార్టీపై విమర్శలు చేస్తే.. ప్రతి విమర్శలతో కట్టడి చేసే వైసీపీ నాయకులు.. ఏకంగా జగన్‌ను ఉద్దేశించి ఇటీవల కాలంలో ఎవరూ చేయని విధంగా విమర్శలు చేసిన బొండా ఉమా విషయంలో మాత్రం మౌనంగా ఉండడం సంచలనంగామారింది. సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా మౌనం పాటించారు. దీనికి కారణం ఏంటి? బొండా ఉమా కు కౌంటర్ ఇవ్వడం కూడా వేస్ట్ అనుకుంటున్నారా ? లేక… తమను ఏమీ అనలేదని భావిస్తున్నారా? ఇప్పుడు ఈ విషయంలో విజయవాడ వైసీపీ నేతల మధ్య హాట్ టాపిక్‌గా మారింది.
బొండా ఉమా వ్యాఖ్యలను ఇప్పటి వరకు ఖండించకపోవడం వెనుక ఏదైనా కారణం ఉందా ? అనే కోణంలోనూ ద్వితీయ శ్రేణి నాయకులు చర్చించుకుంటున్నారు. బొండా ఉమా నోట్లో నోరు పెట్టడం ఇష్టలేక ఉన్నారా? లేక ఆయనతో కుమ్మక్కయ్యారా? అనే సందేహం వస్తోంది. అదే వేరే వేరే నగరాలు.. జిల్లాల్లో అయితే.. సీఎం జగన్‌పై ఇలాంటి సీరియస్ అలిగేషన్స్ చేస్తే.. ఇప్పటికే ఘాటు కౌంటర్లు పేలేవని, కానీ విజయవాడ నేతలు మాత్రం మౌనంగా ఉన్నారని చర్చించుకుంటున్నారు.
-vuyyuru subhash