టీడీపీ పరిస్థితే జగన్ కు వస్తాదంటున్న బుద్దా వెంకన్న!

తాము చేసిన తప్పులే జగన్ చేస్తున్నారని చెప్పే ఉద్దేశ్యమో లేక జగన్ ప్రభుత్వం కూడా టీడీపీ ప్రభుత్వం లాగానే పనిచేస్తుందనే సంకేతాలు ప్రజలకు చేరవేసే ఉద్దేశ్యంలో భాగమో.. అదీ గాక జగన్ మేలుకోరి చెబుతున్నారో ఏమో తెలియదు కానీ… ప్రస్తుతం జగన్ ప్రభుత్వానికి సూచనలు, శాపనార్థాలు కలిపి చెబుతున్నారు టీడీపీ నేత బుద్దా వెంకన్న!

అవును.. దళితులను అవమానిస్తే జగన్‌ ప్రభుత్వానికి పుట్టగతులుండవని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. “జగన్‌ రెడ్డి ఇసుక దందాకి అడ్డొచ్చిన దళిత యువకుడు వరప్రసాద్ ‌కి పోలీసు స్టేషన్‌ లో శిరోముండనం చేసి చావగొట్టారు” అని ట్విట్టర్ లో మండిపడ్డారు. దీంతో… బాబు చేసిన తప్పులు జగన్ కూడా చేస్తున్నారని.. అలా చేస్తే జగన్ ప్రభుత్వానికి కూడా పుట్టగతులు ఉండవని శాపనార్ధాలు పెడుతున్నారు!

బుద్దా వెంకన్న చెప్పింది, సూచించింది కూడా వాస్తవమనే చెప్పాలి. అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన దళితులు ఆ రేంజ్ లో బాబు ను దూరం పెట్టడానికి గల కారణాలు తెలిసినవే. అధికార గర్వంతో “దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు” వంటి పనికిమాలిన మాటలు మాట్లాడిన సంగతి తెలిసిందే! అలాంటి ఆలోచన, అలాంటి ప్రవర్తనే నేడు టీడీపీ అడ్రస్ గల్లంతు అవ్వడానికి కారణం అని బలంగా నమ్ముతున్న బుద్దా వెంకన్న… జగన్ కు అలాంటి సూచనలు చేస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి!!

-CH Raja