దేవుళ్లనూ వదలని బాబు ! వారం రోజుల ప్లాన్ తో ..? 

-

ఇప్పటివరకు హిందూ నినాదాన్ని ప్రస్తావించేందుకు మొహమాట పడిన టిడిపి అధినేత చంద్రబాబు ఇక ఆ మొహమాటాన్ని పక్కనపెట్టి, హిందూ అజెండాతో ముందుకు వెళ్లేందుకు సిద్ధమైనట్లుగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ రథం దగ్ధం అయిన దగ్గర నుంచి ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా కనిపిస్తున్నారు. అంతర్వేది ఘటనలో ఏపీ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అసలు ఏపీ ప్రభుత్వ వైఫల్యం వల్లే హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, అలాగే ఏపీ లో జరుగుతున్న మతమార్పిడులు గురించి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని టిడిపి భావిస్తోంది. అంతేకాదు అంతర్వేది ఘటన తర్వాత సిబిఐను ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాల్సింది గా, కేంద్రానికి లేఖ రాశారు.
కేంద్రం స్పందించే లోపు ఏపీ సీఎం జగన్  ఈ వ్యవహారంపై నిజానిజాలు నిగ్గు తేల్చాలి అంటూ సిబిఐ కు లేఖ రాశారు. ఇదిలా ఉంటే ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని పైచేయి సాధించేందుకు సిద్ధమైన చంద్రబాబు, వారం రోజుల పాటు రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో పూజలు నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. 2020 సెప్టెంబర్ 13వ తేదీ ఆదివారం సూర్య దేవాలయాలు, సోమవారం శివాలయాలు మంగళవారం ఆంజనేయ స్వామి ఆలయాల్లో, బుధవారం అయ్యప్ప, గణపతి, శుక్రవారం కనకదుర్గమ్మ, శనివారం వైష్ణవాలయాల్లో పూజలు నిర్వహిస్తూ వైసీపీ ప్రభుత్వానికి నిరసన తెలియ చేయాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. అయితే ఒక్కసారిగా చంద్రబాబు ఈ విధంగా యూటర్న్ తీసుకోవడం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
గతంలో మతాల పేరు చెబితే భయపడిపోయే చంద్రబాబు ఇప్పుడు అదే రాజకీయంతో ముందుకు వెళ్లాలని చూస్తుండటం కాస్త ఆశ్చర్యం కలిగిస్తోంది.ఇప్పుడు హిందూ దేవాలయాల పై జరుగుతున్న దాడులు అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకుని వైసిపి ప్రభుత్వంపై పోరాటం చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. అంతర్వేది వ్యవహారంపై బిజెపి పోరాటం చేస్తున్నా, అంతగా మైలేజ్ రావడం లేదని, టిడిపికి ఆ క్రెడిట్ దక్కుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. గతంలో ఈ తరహా సంఘటన జరిగినా, ఏపీ ప్రభుత్వం పెద్దగా స్పందించేది కాదు. కానీ ఈ వ్యవహారంలో ఇప్పుడు బిజెపి యాక్టివ్ గా స్పందించడం, ఇది మరింతగా ముదిరే అవకాశం కనిపిస్తుండడంతో  ఏపీ ప్రభుత్వం సిబిఐకు ఈ వ్యవహారాన్ని అప్పగించింది. అయితే ఇదంతా తమ క్రెడిట్ అనే అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నారు. అదే అభిప్రాయంతో ఇప్పుడు పార్టీ శ్రేణులను ఈ వ్యవహారం పై పోరాటం చేయాల్సిందిగా పిలుపు ఇస్తున్నారు.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news