బాబుకు నిద్ర‌లేని రాత్రులు.. త‌మ్ముళ్లు దూరం.. అనుకూల మీడియా దుమారం

-

చేతులు కాలిపోయాక‌.. ఆకులు ప‌ట్టుకున్నా.. ప్ర‌యోజ‌నం లేదంటారు! ఇప్పుడు ఇదేమాట టీడీపీలో వినిపిస్తోంది. పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు.. ఉన్న ప‌రిస్థితి.. నాయ‌క‌త్వం ఇప్పుడు టీడీపీలో ఏకోశానా క‌నిపించ‌డం లేదు. ఎక్క‌డిక‌క్క‌డ నాయ‌కులు సైకిల్ దిగేస్తున్నారు. ఎవ‌రికి వారు దూరంగా ఉంటున్నారు. ఈ ప‌రిస్థితి వ‌చ్చే రెండేళ్ల‌లో మ‌రింత బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. దీనికి రెండు కార‌ణాలు ప్ర‌త్య‌క్షంగా క‌నిపిస్తున్నాయి. ఒక‌టి రాజ‌ధాని త‌ర‌లింపు.. రెండు జిల్లాల విభ‌జ‌న‌. ఈ రెండూ జ‌రిగిపోతే.. నాయ‌కులు టీడీపీకి అంద‌నంత దూరంలోకి వెళ్లిపోతారు.

అమ‌రావ‌తిని ప‌ట్టుకుని వేలాడుతున్న చంద్ర‌బాబు.. విశాఖ‌కు తాను ఎంతో చేశాన‌ని, సీమ‌కు అనేక ప్రాజెక్టులు ఇచ్చాన‌ని ఇటీవ‌ల మీడియా ముందు చెప్పుకొచ్చారు. అయితే.. ఆయ‌న వ్యాఖ్య‌ల‌తో ఏకీభ‌వించిన నాయ‌కులు సొంత పార్టీలోనే క‌నిపించ‌లేదు. అలా క‌నిపించి ఉంటే.. ఇప్ప‌టికే ఈ రెండు ప్రాంతాల్లోనూ సొంత‌గా పార్టీ నేత‌లు రోడ్ల మీదికి వ‌చ్చి ఉండేవారు. కానీ, అలా ఎక్క‌డా జ‌ర‌గ‌లేదు. వైఎస్సార్ సీపీ అధినేత జ‌గ‌న్ తీసుకువ‌చ్చిన రెండు నిర్ణ‌యాలు కనుక అమ‌లైతే.. రాష్ట్రంలో ప్రాంతీయ వాదం దాదాపు క‌నుమ‌రుగు అవుతుంద‌ని అనేవారు సొంత పార్టీలోనే బాబుకు తార‌స‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మాట‌ల‌ను ప‌ట్టించుకునే నాధుడు క‌నిపించ‌డం లేదు.

పోనీ.. అనుకూల మీడియా ఉంది క‌దా.. అదైనా పార్టీని కాపాడుతుందా? అనుకుంటే.. ఈనాడు త‌న దారి తాను చూసుకునేందుకు ముందుకు దూకుతోంది. కేంద్రంలో బీజేపీతో స‌ఖ్య‌త‌గా ఉన్న ఓ ప్ర‌ధాన ప‌త్రిక రాష్ట్రంలో జ‌గ‌న్‌పై దూకుడు ప్ర‌ద‌ర్శించే ప‌రిస్థితి లేదు.అనుకూలంగా వెళ్ల‌క‌పోయినా.. వ్య‌తిరేకంగా మాత్రం ఆ ప‌త్రిక‌ ముందుకుసాగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఇక బాబుకు అనుకూలంగా రెండో ప్ర‌ధాన ప‌త్రిక /  ఛానెల్‌ ఉన్న‌ప్ప‌టికీ.. ఈ ప‌త్రిక‌లో అనుకూల వార్త‌లు కూడా ప్ర‌తికూలంగా వ‌స్తుండడంతో ఈ ప‌త్రిక‌ను కొని చ‌దివేవారు కూడా ఈ రాత‌ల‌ను ఎవ‌రూ న‌మ్మ‌డం లేదు. ఒక‌వేళ న‌మ్మి ఉంటే.. గత ఏడాది ఎన్నిక‌ల్లోనే చంద్ర‌బాబు మ‌రోసారి అదికారంలోకి వ‌చ్చి ఉండేవారు. ఈ ప‌రిణామాల‌తో చంద్ర‌బాబు నిద్ర‌ప‌ట్ట‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు

Read more RELATED
Recommended to you

Latest news