హాంకాంగ్‌లోని తమ వ్యతిరేక శక్తులను అణగదొక్కి, పూర్తిస్థాయి ఆధిపత్యం సాధించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది చైనా. కొత్తగా తీసుకొచ్చిన జాతీయ భద్రతా చట్టాన్ని అడ్డంపెట్టుకుని హాంకాంగ్ మీడియా దిగ్గజం జిమ్మీ లైను అరెస్టు చేయించింది.జిమ్మీకి చెందిన ‘నెక్స్ట్ డిజిటల్ గ్రూప్’ సంస్థలో సోదాలు నిర్వహించి ఆధారాలు సేకరించినట్లు ఆయన సహాయకుడు మార్క్ సైమన్ వెల్లడించారు. ఆయనపై విదేశీ శక్తులతో సంబంధాలు ఉన్నట్లు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
లై, ఆయన కుమారుడి ఇళ్లల్లోనూ సోదాలు చేశారని, సంస్థకు చెందిన పలువురు సభ్యులనూ నిర్బంధంలోకి తీసుకున్నారని స్పష్టం చేశారు.కొత్త చట్టం ఉల్లంఘన కింద మొత్తం 9 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వారిపై విదేశాలతో సంబంధాలు, మోసపూరిత కుట్ర వంటి అభియోగాలు ఉన్నాయని తెలిపారు. అయితే వాళ్ల పేరు, ఇతర వివరాలు తెలిపేందుకు నిరాకరించారు.చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వార్తా సంస్థలపై ప్రయోగించి, మీడియా స్వేచ్ఛను అణగదొక్కేందుకు ప్రయత్నించటం ఇదే తొలిసారి. ఈ చట్టంతో ఓ ప్రముఖ వ్యక్తిని లక్ష్యంగా చేసుకోవటమూ మొదటిసారే.