దళితులందు సీమ దళితులు వేరా బాబూ!

చంద్రబాబుది ఏ మాట నమ్మాలో ఏ మాట నమ్మకూడదో తెలియని పరిస్థితి! అప్పటికప్పుడే బీసీ లంటే ప్రేమ అంటారు.. ఒక బీసీ నేత హత్యకాబడితే ఆయన వేరే పార్టీ నేత అయితే ఆ దిక్కుకు కూడా చూడరు సరికదా.. హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని పరామర్శించి తానున్నానని భరోసా ఇచ్చి వచ్చేస్తారు! ఇదే క్రమంలో తాజాగా దళితులపై ప్రేమ చూపిస్తున్నారు చంద్రబాబు.. ఇందులో కూడా మళ్లీ తనదైన రాజకీయం!

తాజాగా నంద్యాల నియోజకవర్గంలోని పొన్నాపురానికి చెందిన సుబ్బరాయుడు వైఎస్సార్‌సీపీ నేతగా, న్యాయవాదిగా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పాటుపడేవారు. ఇటీవల ఆయన పొన్నాపురం వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. ఈ నెల 9న హత్యకు గురయ్యారు. ఈ విషయంపై దళిత సంఘాలు ఆందోళన చేస్తున్నాయి! అయితే గత కొన్ని రోజులుగా దళితులపై కొత్త ప్రేమ చూపిస్తున్న చంద్రబాబు… ఈ విషయంపై స్పందించనే స్పందించలేదు!

ఇతరులతో ఎన్నడూ ఘర్షణ కూడా పడని సుబ్బరాయుడును టీడీపీ నాయకులు కేవలం రాజకీయ ఆధిపత్యం కోసం హతమార్చారనేది నంద్యాల కేంద్రంగా వినిపిస్తున్న మాట. ఈ హత్యలో భూమా అఖిల ప్రియ ప్రమేయం పై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీమాంధ్ర ప్రాంతంలో దళితులపై దాడులు జరిగిన ప్రతిసారీ స్పందిస్తున్న బాబు & చినబాబు… ఈ ఒక్క విషయంలో ఎందుకు స్పందించడం లేదు. దోషులను కఠినంగా శిక్షించాలని ఎందుకు డిమాండ్ చేయడం లేదు! ఈ అనుమానలే కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి.. వైకాపా నేతల ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తున్నాయి!!