రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరదలు, ముంపు గ్రామాలపై మంత్రి సీతక్క బుధవారం అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చర్యలపై అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రహదారుల పునరుద్ధరణపై అధికారులు ముందుగా ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. ఈ పనులకు అవసరమైన నిధులను మంజూరు చేస్తామని అధికారులకు చెప్పారు. అంతేకాకుండా మండలానికి ఐదుగురి చొప్పున ఫ్లడ్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.విధి నిర్వహణ టైంలో ఎవరైనా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.కాగా, తెలంగాణలో భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం జిల్లా,మహబూబాబాద్, వరంగల్‌లోని కొన్ని ప్రాంతాలు, ఆదిలాబాద్‌లోని పలు కాలనీలు, సూర్యాపేట, కోదాడలో పలుగ్రామాలు ముంపునకు గురయ్యాయి.