ఏపీలో వైస్సార్సీపీ ఘోర పరాజయం చవిచూసింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, సీఎం జగన్‌మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయని అన్నారు. ఇలాంటి ఫలితాలు ఊహించలేదని.. అక్కచెల్లెమ్మల ఓట్లు ఎటు పోయాయో అర్థం కావడం లేదని వాపోయారు. పింఛన్లు అందుకున్న అవ్వాతాతల ఓట్లు ఏమయ్యాయో అర్థం కావట్లేదన్న జగన్.. ఎన్నో పథకాలతో ప్రజలకు అండగా ఉన్నానని.. పథకాలు అందుకున్న వారి ఆప్యాయత ఏమైందో తెలియదని వ్యాఖ్యానించారు.
“ప్రజలకు మంచి చేసినా ఓటమి పాలయ్యాం. 54 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం చేశాం. రైతన్నలను అన్ని రకాలుగా ఆదుకున్నాం. అరకోటి రైతన్నల ప్రేమ ఏమైందో అర్థం కావడం లేదు. ఆటో డ్రైవర్లు, గీత కార్మికులు, మత్స్యకారులకు అండగా ఉన్నాను. వారందరి ప్రేమ ఏమైందో అర్థం కావడం లేదు. ఇన్ని కోట్ల మందికి ఎంతో మేలు చేసినా ఓడిపోయాం. మేనిఫెస్టో హామీలను 99 శాతం అమలు చేశాం. కోట్ల మందికి మంచి చేసినా అభిమానం ఏమైందో తెలియట్లేదు” అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.