టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. శుక్రవారం అమలాపురంలో వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం నిధులు విడుదల చేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. అక్క చెల్లెమ్మలు చల్లగా ఉంటే కుటుంబం సంక్షేమంగా ఉంటుందన్నారు.
మహిళా పక్షపాతిగా ముందడుగు వేశామని.. 0 వడ్డీని ప్రతి ఏడాది క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నామన్నారు. 2016లో 0 వడ్డీ రుణాలను రద్దుచేసి చంద్రబాబు డ్వాక్రా మహిళలను నడిరోడ్డుపై నిలబెట్టారని విమర్శించారు. రుణాలు మాఫీ చేయకుండా మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం మాత్రం మహిళలకు అండగా నిలుస్తూ ముందుకు సాగుతుందన్నారు.
మూడు విడతల్లో 19 వేల కోట్లకు పైగా మహిళల చేతిలో పెట్టామని తెలిపారు. ఏపీలో మహిళల కోసం అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయట్లేదు అన్నారు. మహిళల పేరు మీదే 30 లక్షల ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించామని.. వారి పేరు మీద 22 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా చేపడుతున్నాం అన్నారు. నవరత్నాల అమలుతో రాష్ట్ర అభివృద్ధిలో, ప్రజల జీవితాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుందన్నారు.