ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 22న చిత్తూరు జిల్లా కుప్పంలోో పర్యటించనున్నారు. ఇటీవల కాలంలో చంద్రబాబు కుప్పం పర్యటన తీవ్ర ఉద్రిక్తత కు దారి తీసిన సంగతి తెలిసిందే. అన్న క్యాంటీన్ ప్రారంభం నేపథ్యంలో వైఎస్ఆర్సిపి, టిడిపి మధ్య కొట్లాటతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ కుప్పం పర్యటన ఆసక్తికరంగా మారింది. ఈనెల 22న ఆయన కుప్పం రానున్నారు.
కుప్పం మున్సిపాలిటీలో రూ. 66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ఈ మేరకు సీఎం పర్యటన ఖరారు అయినట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సీఎం రానుండడంతో ఎమ్మెల్సీ భరత్, జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాసులు హేలీప్యాడ్ కోసం స్థలాలను పరిశీలించారు. కుప్పం మునిసిపాలిటీ తో పాటు పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పిటిసి ఎన్నికల్లోను వైఎస్ఆర్సిపి అత్యధిక సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కుప్పం సీటును కైవసం చేసుకోవాలని వైసిపి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.