కేసీఆర్ వ‌ర్సెస్ జ‌గ‌న్‌… మ‌ళ్లీ ఉప్పు.. నిప్పు….!

-

చేతులు క‌లిపిన నేత‌లే ఇప్పుడు క‌య్యానికి సిద్ధ‌మ‌వుతున్నారా?  మేం పూర్తిగా ఒక‌రికొక‌రం స‌హ‌క‌రించుకుంటాం.. అంటూ మీడియా ముందు వాగ్దానాలు చేసిన నాయ‌కులే ఇప్పుడు ఒక‌రిపై ఒక‌రు నిప్పులు చెరిగే ప‌రిస్థితి వ‌చ్చిందా? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు ముందు జ‌గ‌న్ కూడా దూకుడు ప్ర‌ద‌ర్శించాల్సిన అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని చెబుతున్నారు. నీటి జ‌గ‌డం ఇరు రాష్ట్రాల మ‌ధ్య పూర్తిగా విభేదాలు సృష్టించ‌నుంది. నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు సీమ ఎత్తిపోత‌ల ప‌థ‌కంపై కారాలు మిరియాలు నూరిన తెలంగాణ ప్ర‌భుత్వం దొడ్డిదారిలో చేస్తున్న ప‌నులు జ‌గ‌న్‌కు కూడా చిర్రెత్తుకొచ్చేలా చేస్తున్నాయి. ఇలాంటి వాటికి ముకుతాడు వేయ‌క‌పోతే.. మున్ముందు రాజ‌కీయంగాతీవ్ర దెబ్బ త‌ప్ప‌ద‌ని ఆయ‌న భావిస్తున్నారు.

ఈ ప‌రిణామంతో కేసీఆర్ వ‌ర్సెస్ జ‌గ‌న్ వివాదాలు, విభేదాలు మ‌రింత ముదురుతాయ‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. విష‌యంలోకివెళ్తే.. విద్యుదుత్పత్తి పేరుతో శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ ప్ర‌భుత్వం నీళ్లు తోడేస్తోంది. ఇలా చేస్తే..ఏపీలోని ఏడు జిల్లాల‌కు నీరు అంద‌ద‌ని జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిన్న మొన్న‌టి వ‌ర‌కు వాదించింది. అయిన‌ప్ప‌టికీ.. తెలంగాణ ప్ర‌భుత్వం ఈ వ్యాఖ్య‌ల‌ను ఖాత‌రు చేయ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ ప్ర‌భుత్వం దీనిపై కృష్ణా రివ‌ర్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. దీంతో బోర్డు ఈ విష‌యంపై దృష్టి పెట్టింది. నీటి తోడ‌కాన్ని ఆపాలని ఇదివరకే ఆదేశించినా తెలంగాణ ప్రభుత్వం వినకపోవడంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆగ్రహం వ్యక్తంచేసింది. తక్షణమే విద్యుదుత్పత్తి నిలిపివేయాలని మరోసారి నిర్దేశించింది.

రాయలసీమలోని చిత్తూరు, కర్నూలు, అనంతపురం కడప జిల్లాలు నాలుగూ తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలు. గుంటూరు, ప్రకాశం జిల్లాలు కరువుబారినపడ్డాయి. ఉప్పునీరే వారికి ఆధారం. వీటన్నిటితోపాటు నెల్లూరు జిల్లాకు తాగునీటి అవసరాలకు నీళ్లు అందుబాటులో లేకుండా శ్రీశైలం ఎడమ ప్రధాన కాలువ నుంచి నీటిని తోడేస్తూ జల విద్యుదుత్పత్తి చేయడం సరికాదనేది జ‌గ‌న్ ప్ర‌భుత్వ వాద‌న. అయిన‌ప్ప‌టికీ.. తెలంగాణ మాట విన‌డం లేదు. దొడ్డిదారిలో శ్రీశైలం నీటిని తోడేసి..విద్యుత్ ఉత్ప‌త్తి చేసుకుంటున్నారు. ఈ ప‌రిణామాలపై జ‌గ‌న్ సీరియ‌స్‌గా ఉన్నారు. ఈ నేప‌థ్యంలోనే సీమ ఎత్తిపోత‌ల విష‌యంలో తాము కూడా కేసీఆర్‌కు గ‌ట్టి షాక్ ఇవ్వాల‌ని ఆయ‌న నిర్ణ‌యించుకున్నారు. ఈ విష‌యంపై ఇరు రాష్ట్రాల మ‌ధ్య ఉప్పు-నిప్పుగా మారే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Read more RELATED
Recommended to you

Latest news