విజ‌య‌వాడ వైసీపీ ఎమ్మెల్యే చుట్టూ సెగ‌…!

ప్ర‌త్య‌ర్థులు సెగ పెడితే.. రాజ‌కీయం చేస్తున్నారంటూ.. త‌ప్పించుకోవ‌చ్చు. ప్ర‌జ‌ల్లోకి వెళ్లి పుంజుకునే ప్ర‌య‌త్నం కూడా చేయొచ్చు. కానీ, ప్ర‌జ‌ల్లోనే సెగ పుడితే.. ఏం జ‌రుగుతుంది ?  వారిని మార్చ‌డం సాధ్య‌మా ? అనేది ఇప్పుడు విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క ‌వ‌ర్గంలో జోరుగా వినిపిస్తున్న మాట‌. దీనికి కార‌ణం.. ఎమ్మెల్యే విష్ణు ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కు క‌నిపించ‌క‌పోవ‌డ‌మే..! గ‌తంలో 2009లో విజ‌యం సాధించిన ఆయ‌న 2014లో కాంగ్రెస్ త‌ర‌ఫున పోటీ చేసి ప‌రాజ‌యం పాల‌య్యారు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో వైసీపీ దూకుడుతో విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే, ఆ స‌మ‌యంలో ఆయన అనేక హామీలు ఇచ్చారు.

ఇక్క‌డఅనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. రైల్వే ఫ్లైవోర్ బ్రిడ్జ్ నిలిచిపోయింది. దీనిని కొన‌సాగించాల్సిన అవ‌స‌రం ఉంది. అదేవిధంగా ర‌హ‌దారుల విస్త‌ర‌ణ కోసం స‌త్య‌నారాయ‌ణ‌పురం వాసులు ఎదురు చూస్తున్నారు. ఇక‌, బెల్టు షాపుల నిరోధం మాటేమో కానీ, ఏకంగా ఎమ్మెల్యే అనుచ‌రులే బెల్ట్ నిర్వ‌హిస్తున్నార‌నే టాక్ ఉంది. ఇక‌, పింఛ‌న్ల కోసం ఎవ‌రైనా వెళ్తే.. డ‌బ్బులు వ‌సూలు చేస్తున్నార‌ని అంటున్నారు. ఈ ప‌రిణామాల‌తో నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు.

పైగా ప్ర‌జారోగ్యానికి ఏదైనా స‌మ‌స్య వ‌స్తే.. ఎక్క‌డో తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ప్ర‌భుత్వాస్ప‌త్రే గ‌తి. దీనిపై స్పందించిన విష్ణు.. దానిని మించిన ఆసుప‌త్రిని నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేస్తాన‌ని హామీ ఇచ్చారు. కానీ, ఇప్ప‌టికీ.. ఆయ‌న ఇచ్చిన హామీలు అమ‌లు కాక‌పోగా.. గ‌త ఏడాది ముగిసిన ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఇప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వర్గంలో ఆయ‌న ప‌ర్య‌టించింది కూడా లేదు దీంతో ప్ర‌జ‌లు ఆగ్ర‌హావేశాల‌తో ఉన్నారు. కొంద‌రైతే… మా ఎమ్మెల్యేను ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌లేద‌ని అంటున్నారు. ఇంకొంద‌రు ఎందుకు ఓటేశామా? అని ప్ర‌శ్నిస్తున్నారు.

ఇదిలావుంటే.. విష్ణు వ్యూహం మ‌రోలా ఉంద‌ట‌. మంత్రి ప‌ద‌వి కోసం ఆయ‌న ప్ర‌య‌త్నాలు ఆయ‌న చేస్తున్నార‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలోనే నిత్యం అమ‌రావ‌తిలోనే ఉంటున్నార‌ని.. పార్టీ త‌ర‌ఫున వాయిస్ వినిపిస్తున్నార‌ని చెబుతున్నారు. కానీ క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల‌కు అందుబాటులో లేక‌పోతే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రంఎక్కుతారా ? అనేది ఆయనే ఆలోచించుకోవాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.