కొన్ని కొన్ని చిత్రమైన విశ్లేషణలు తెరమీదకి వస్తుంటాయి. అలాంటి వాటిలో ఇప్పుడు ఏపీ సీఎం జగన్ గురించి కూడా ఇలాంటి విశ్లేషణే ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తోంది. కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి.. ఏడాదిన్నర పూర్తయింది. ఇప్పటి వరకు ఆయన ప్రజల్లోకి రాలేదు. పైగా ప్రజల సమస్యలు కూడా వినిపించుకోవడం లేదు. తాను ఎన్నికలకు ముందు ఏ హామీ లైతే ఇచ్చానో.. వాటిని తూచ తప్పకుండా అమలు చేస్తున్నానని చెబుతున్నారు. మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా పేర్కొంటున్నారు. దీనిలో పేర్కొన్న అంశాలను పూర్తి చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇంత వరకు బాగానే ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం ఆయన పర్యటించడం లేదు. మరి ఎందుకు వెళ్లడం అనుకుంటున్నారో.. లేదా అంతా బాగానే ఉందని భావిస్తున్నారో తెలియదు కానీ.. నియోజకవర్గాల సమీక్ష కూడా చేయడం లేదు. స్థానిక అంశాలపై అసలు చర్చ కూడా పెట్టడం లేదు. అంతేకాదు.. క్షేత్రస్థాయిలో ఇసుక దోపిడీ, భూకబ్జాలు, ఎస్సీలపై దాడులు.. అధికార పార్టీ నేతల దూకుడు వంటి ఆరోపణలు గుప్పు మంటున్నా కూడా జగన్ పట్టించుకోవడం లేదు. దీంతో జగన్ పరిస్థితి నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ మాదిరిగానే ఉందని అంటున్నారు పరిశీలకులు.
గతంలో ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ కూడా అంతా బాగానే ఉందని అనేవారు. క్షేత్రస్థాయిలో అక్రమాలు జరుగుతున్నా.. లోపాలు ఉన్నా.. ఆయన పట్టించుకోలేదు. కనీసం ప్రజల్లోకి కూడా వచ్చేవారు కాదు. అయితే, ఆయనకు జగన్‌కు తేడా ఉంది. ఆయన కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీ నామినేట్ చేసిన ప్రధాని. కానీ, జగన్ అలాకాదు కదా.. ప్రజలు ఎన్నుకున్న నాయకుడు, ప్రజలు అధికారం ఇచ్చిన నాయకుడు. కానీ, జగన్ మాత్రం ఎక్కడా ఆదిశగా ఆలోచించడం లేదనేది పరిశీలకుల మాట.
ప్రజలను పట్టించుకోకుండా.. ఎన్ని కార్యక్రమాలు అమలు చేసినా.. ఫలితం సాధించడం కష్టమేనని అంటున్నారు. పథకాలు పక్కదారి పడుతున్నాయని.. చాలా జిల్లాల్లో ఆరోపణలు వస్తున్నాయి. సొంత పార్టీ నేతలే అన్నీ తామై వ్యవహరిస్తున్నారని విమర్శలు కూడా వస్తున్నాయి. అయినా.. జగన్ మౌన ముద్ర వీడకపోవడం గమనార్హం. మరి ఇలానే ఉంటారో.. మారతారో చూడాలి.