ఏపీలోకోనసీమ జిల్లాలో బోరులోంచి గ్యాస్, మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక్కసారిగా బోరులో నుంచి మంటలు ఎగసిపడటం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. రాజోలు మండలం శివకోటిలోని ఆక్వా చెరువు వద్ద ఈ ఘటన జరిగింది. ఇవాళ ఉదయం నుంచి ఈ అగ్నికీలలు, గ్యాస్ ఎగసిపడుతుండటంతో.. స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. 20 అడుగుల మేర ఈ మంటలు ఎగసిపడుతున్నాయని స్థానికులు తెలిపారు.
సమాచారం అందుకున్న ఓఎన్జీసీ, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలార్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటన జరిగిన ప్రదేశంలో గ్యాస్ కోసం గతంలో సెస్మిక్ సర్వే జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఆక్వా చెరువుల్లో నీటి కోసం అదే చోట 6 ఏళ్ల కిందట బోరు వేయగా.. రెండు రోజుల కిందట ఈ బోరును మరింత లోతుకు తవ్వారు. దీంతో భూమిలోని గ్యాస్ బయటికి వచ్చి నేడు మంటలు వస్తున్నట్లు అధికారులు తెలిపారు. పైప్‌లైన్ అయితే గ్యాస్‌ను నిలిపివేసి మంటలను ఆపేవాళ్లమని.. భూమిలో నుంచి నిరంతరంగా గ్యాస్ వస్తుండటంతో.. మంటలు అదుపు చేయడం కష్టంగా మారిందని వెల్లడించారు.