ఏపీ ప్రభుత్వానికి గ్లోబల్ డిజిటల్ అవార్డు దక్కింది. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి చౌకగా అత్యాధునిక వైద్యం అందించడమే రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ ధ్యేయమని, అందుకోసం వైద్య రంగంలో విప్లవాత్మక విధానాలు ప్రవేశపెడుతున్నారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని చెప్పారు.
వైద్యుడు, మానవతావాది అయిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లోనే ఆయన తనయుడు సీఎం జగన్ సాగుతున్నారని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో వైద్యరంగం అభివృద్ధికి ప్రవేశపెట్టిన సంస్కరణలు, అందరికీ వైద్యాన్ని అందుబాటులో ఉంచేందుకు చేపట్టిన కార్యక్రమాలకు గుర్తింపుగా ఏపీ ప్రభుత్వానికి రెండు గ్లోబల్ డిజిటల్ హెల్త్ అవార్డులు దక్కాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో శనివారం జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు ముగింపు సమావేశంలో గౌరవ అతిథిగా పాల్గొన్న మంత్రి రజిని ఈ అవార్డులను అందుకున్నారు.