మంచిని స్వాగతించడం కూడా ఓ మంచి నిర్మాణాత్మక సమాజానికి అత్యవసరం. అత్యావస్యకం కూడా ! ఆంధ్రావనిలో త్వరలో ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు సీఎం జగన్. ఇదే కనుక జరిగితే త్వరలో 330 పంచాయతీల్లో ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యూనిట్ల ఏర్పాటు అదేవిధంగా యువతకు ఉపాధి అన్నవి సాధ్యం అయి తీరుతాయి అన్న ఆశావహ దృక్పథం ఒకటి వైసీపీ వర్గాల నుంచి, అదేవిధంగా జగన్ సర్కారును అభిమానిస్తున్న వారి నుంచి వినవస్తోంది.
చెత్తను రీసైక్లింగ్ చేయడం ద్వారా రోడ్ల నిర్మాణానికి ఆ వ్యర్థాలను వాడొచ్చు. అదేవిధంగా సిమెంట్ తయారీలోనూ వినియోగించవచ్చు. అని ప్రధాన మీడియా చెబుతోంది. వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా మంచి ఫలితాలు అందుకోవచ్చని వివరిస్తోంది. అందుకు దోహదం పడే విషయాలను విస్తరిస్తూ.. ఈ నిర్ణయం బాగుందని వెల్లడి చేస్తుంది.
వాస్తవానికి ఎప్పటినుంచో చెత్తను రీ సైక్లింగ్ చేయడంపై కూడా కొంత ఆలోచన ఉంది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. వేస్టేజ్ మేనేజ్మెంట్ కారణంగా కాస్తో కూస్తో పర్యావరణానికి జరిగే హానిని తగ్గించవచ్చు. అదేవిధంగా విరివిగా వాడుతున్న ప్లాస్టిక్ కారణంగా వ్యర్థాలు లక్షల టన్నుల్లో పేరుకు పోతున్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే ఆర్థికంగా కూడా కలిసివస్తుంది. ఇప్పటికే ఇళ్ల నుంచి సేకరిస్తున్న చెత్తను వర్మీ కంపోస్టుకు తరలిస్తున్నామని ఏపీ అధికారులు అంటున్నారు. అదేవిధంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ పేరిట చెత్త సేకరణ, తరలింపు అనంతరం నిర్వహణ, రీ సైక్లింగ్ అన్నవి మరింత మంచి ఫలితాలు అందుకోవచ్చు. ఇప్పటికే క్లాప్ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో పదిహేను వేల కోట్లకు పైగా నిధులు వెచ్చించామని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ ప్లాస్టిక్ వ్యర్థాల రీ సైక్లింగ్ కేంద్రం ఒప్పుకుంటే అందుకు తగ్గ నిధులు కూడా కాస్తో కూస్తో ఇవ్వగలిగితే ప్రతిపాదిత నిధులు విడుదల చేయగలిగితే క్లీన్ ఆంధ్రప్రదేశ్ ప్రొగ్రాం మరిన్ని విజయాలు అందుకునేందుకు అవకాశం దక్కుతుంది.