ఎస్పీ బాలు విగ్రహ వివాదం.. గుంటూరు కమిషనర్ ఏమన్నారంటే..?

గుంటూరులో ప్రముఖ గాయకుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి అవమానం జరిగిన సంఘటనపై నగరపాలక సంస్థ స్పందించింది. ‘‘నగరంలో ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటుపై అపోహలు వచ్చాయి. 2021 జూన్‌ 5న నాజ్‌ సెంటర్లో బాలు విగ్రహం ఏర్పాటుకు కార్పొరేషన్‌ అనుమతిచ్చింది. అనుమతించిన ప్రదేశంలో కాకుండా మదర్‌ థెరీసా సెంటర్‌లో విగ్రహం పెట్టారు. అనుమతిలేని చోట విగ్రహం ఏర్పాటు చేయడంతో తొలగించాం. నాజ్‌ సెంటర్‌లో విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కళా దర్బార్‌ వారికి చెప్పాం. బాలు గారిని అగౌరవపర్చాలని విగ్రహం తొలగించలేదు. అనుమతిచ్చిన ప్రాంతంలోనే విగ్రహం ఏర్పాటు చేసుకోవాలి. బీపీ మండల్‌ విగ్రహానికి కూడా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పాం’’ అని గుంటూరు కమిషనర్‌ చేకూరి కీర్తి వెల్లడించారు.

అసలేం జరిగిందంటే.. గుంటూరు నగరంలోని మదర్‌ థెరీసా కూడలిలో కళా దర్బార్‌ ఆధ్వర్యంలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనుమతి లేదంటూ నగరపాలక సంస్థ అధికారులు దానిని తొలగించారు. దీంతో కార్పొరేషన్‌ అధికారులపై కళాకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంపై గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ చేకూరి కీర్తి తాజాగా క్లారిటీ ఇచ్చారు.