జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రమూకలు జరిపిన ఎదురు కాల్పుల్లో గుంటూరు జిల్లాకు చెందిన జవాన్ మరుపోలు జశ్వంత్ రెడ్డి (Jashwant Reddy) (23) వీర మరణం పొందారు. జశ్వంత్ రెడ్డి స్వస్థలం బాపట్ల మండలం దరివాడ కొత్తపాలెం గ్రామం. జమ్మూ కాశ్మీర్‌లో ముష్కరులను మట్టుబెట్టేందుకు భద్రతా దళాలు సెర్చింగ్ ఆపరేషన్ ను నిర్వహిస్తున్నాయి.
సెర్చింగ్ ఆపరేషన్ లో భాగంగా రాజౌరి జిల్లా సుందర్‌బని సెక్టార్‌లో గురువారం రాత్రి పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా.. ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. వీర మరణం పొందిన జవాన్లలో గుంటూరు జిల్లాకు చెందిన జశ్వంత్ రెడ్డి కూడా ఉన్నారు. మరో జవాన్ ను నాయబ్ శ్రీజిత్ గా గుర్తించారు. జశ్వంత్ రెడ్డి మృతి పట్ల ఆర్మీ అధికారులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న జశ్వంత్ రెడ్డి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.
జశ్వంత్ రెడ్డి మే 17, 2016న మద్రాస్ రెజిమెంట్‌లో చేరారు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం జమ్మూ కాశ్మీర్‌లో విధుల్లో చేరారు. జశ్వంత్‌కు త్వరలోనే వివాహం చేయాలని ఆలోచనలో ఆయన తల్లిదండ్రులు ఉన్నట్లు తెల్సింది. ఈ సమయంలోనే జశ్వంత్‌రెడ్డి చనిపోవడంతో స్థానికంగా విషాదచాయలు అలముకున్నాయి