టిడిపి శాసనసభ్యుడు, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ తనకు భద్రత తొలగించడంపై హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఫోన్ టాపింగ్ పై తాను మాట్లాడినందుకు వల్లే భద్రత తొలగించారని పయ్యావుల తన పిటీషన్ లో ఆరోపించారు. 1994 నుంచి తనకు 2 + 2 భద్రత కొనసాగుతుందని, కానీ ఫోన్ టాపింగ్ ఆరోపణలు చేసినప్పటినుండి భద్రత తొలగించారని, గత ఆరు నెలలుగా తాను భద్రత లేకుండానే తిరుగుతున్నానని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో పయ్యావులకు భద్రత కల్పించాల్సిందేనని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ పిటిషన్ పై గతంలో విచారణ జరగగా.. కేశవ్ కు భద్రత కల్పించాల్సిన అంశానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అయితే నేడు జరుగుతున్న విచారణలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంతో హైకోర్టు కేశవ్ కు ప్రస్తుతం ఉన్న సెక్యూరిటీకి అదనంగా మరో 1 + 1 సెక్యూరిటీ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.