కరోనా వేళ కాలేజీ ఫీజులపై రివ్యూనా జగన్…?

-

రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఎంచక్కా ఫిడేల్ వాయించిన వైనాన్ని తరచూ గుర్తుకు తెస్తుంటారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తే.. నీరో చక్రవర్తికి ఏ మాత్రం తీసిపోని రీతిలో మారారన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. ఓపక్క కరోనా వైరస్ తో రాష్ట్రం మొత్తం ఆగమాగమైపోతున్న వేళ.. యుద్ధప్రాతిపదికన తీసుకోవాల్సిన చర్యల పైన ఫోకస్ పెట్టాల్సింది పోయి.. అందుకు భిన్నంగా జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని చేపట్టటమా? అన్నది ప్రశ్నగా మారింది. ఇంతకీ జగనన్న విద్యా దీవెన కార్యక్రమం ఏమిటన్న విషయంలోకి వెళితే.. కాలేజీ విద్యార్థుల నుంచి రకరకాల పేర్లతో ఫీజులు తీసుకోవటానికి వీల్లేదని.. ఫీజు ఒకటే ఉంటుందని.. దాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని చెబుతున్నారు ముఖ్యమంత్రి.


రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకూ ఇలాంటి కార్యక్రమాన్ని ఎవరూ చేపట్టలేదని చెబుతున్నారు. నిజానికి ఇలాంటి కార్యక్రమం మామూలు రోజుల్లో నిర్వహిస్తే అతికినట్లుగా సరిపోవటమే కాదు.. ప్రజల్లో చక్కటి మైలేజీ కూడా వచ్చేది. ఇప్పుడు నడుస్తున్నదంతా కరోనా కాలం. అందునా ఏపీలో కేసుల నమోదు ఎక్కువగా ఉంది. కర్నూలు జిల్లాలో ఏకంగా 330 కేసులకు పైనే నమోదు కావటం.. అదే బాటలో గుంటూరు.. క్రిష్ణా జిల్లాలు పయనిస్తున్న వేళ.. కాలేజీ ఫీజులపై రివ్యూ నిర్వహించటం ముఖ్యమా? లేదంటే కరోనా వ్యాప్తికి చెక్ పెట్టేందుకు అవసరమైన వ్యూహంపై కసరత్తు చేయటం సరైనదా? అంటే సమాధానం చిన్నపిల్లాడైనా చెప్పేస్తాడు.

అలాంటిది జగన్ మాత్రం.. తాడేపల్లిలోని తన క్యాంప్ ఆఫీసులో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఇందులో విద్యార్థుల తల్లులతో మాట్లాడారు. కాలేజీ ఫీజులు ఇప్పటికే చెల్లించి ఉంటే వెనక్కి ఇస్తారని.. ఒకవేళ ఇవ్వకుంటే 1902 నెంబరుకు కంప్లైంట్ ఇవ్వాలన్న సూచనను చేశారు. ఓవైపు వైరస్ తో ప్రాణాలు పోతున్న వేళ.. ఆ విషయాలు పట్టనట్లుగా కాలేజీ విద్యార్థులు.. వారి తల్లిదండ్రులతో రివ్యూ పెట్టుకోవటం చూస్తే.. సీఎం జగన్ కు ఎప్పుడేం చేయాలన్న విషయంపైనా అవగాహన ఉండదా? అన్న సందేహం వ్యక్తం కావటం ఖాయం.

Read more RELATED
Recommended to you

Latest news