అధికారంలోకి వచ్చిన జగన్.. ఇప్పటి వరకు తీసుకున్న చాలా నిర్ణయాల్లో కొన్ని సంచలనం సృష్టించినవి ఉన్నాయి. మరికొన్ని .. బ్రహ్మాండం బద్దలయ్యేవీ ఉన్నాయి. మరికొన్నివిస్మయం కలిగించినవి కూడా ఉన్నాయి. అయితే, ఇప్పటి వరకు జగన్ తీసు కోని.. ఓ అద్భుతమైన చెత్త నిర్ణయం త్వరలోనే తీసుకుంటారనే వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తుండడం, వారే దీనిని చెత్త నిర్ణయమని అనడం సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆహా .. ఓహో.. అన్న నేతలే ఇప్పుడు ఆఫ్ దిరికార్డుగా.. సదరు నిర్ణయంపై మాత్రం సటైర్లు పేలుస్తున్నారు.
ఇంతకీ విషయం ఏంటంటే.. రాష్ట్రానికి బహుళార్ధ సాధక ప్రాజెక్టు ఏదైనా ఉంటే.. నాగార్జున సాగర్(దీనిలోనూ తెలంగాణకు వాటా ఉంది) తర్వాత పోలవరం పూర్తిగా అందివచ్చిన ప్రాజెక్టు. అయితే, ఇది ఏ ముహూర్తాన శంకుస్థాపనకు నోచుకుందో తెలియదు కానీ.. అప్పటి నుంచి అనేక వివాదాలతో ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి అన్నచందంగా మారిపోయింది. ఎప్పటికప్పుడు అయిపోతుంది.. ఇంకేముంది.. వచ్చే ఏడాది నుంచి వాటర్ పారుతుంది.. అని ప్రచారం చేసిన పార్టీలు, ప్రభుత్వాలే తప్ప.. నిజంగా దీనిపై దృష్టి పెట్టిన పార్టీలు, ప్రభుత్వాలు లేవు.
అయితే, చంద్రబాబు హయాంలో దీనిని రాజకీయంగా మలుచుకున్నా.. అంతో ఇంతో ముందుకు తీసుకువెళ్లి కొంత హడావుడి అయితే చేయగలిగారు. ఇక, ఇప్పుడు జగన్ సర్కారు హయాంలో ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 23 వేల కోట్లకు మించి ఇచ్చేది లేదని.. కేంద్రం తెగేసి చెప్పింది. దీంతో ఇది ఇక ఇప్పట్లో తేలే సమస్యగా కనిపించడం లేదు. దీంతో సర్కారుపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. పైకి మాత్రం వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెబుతున్నా.. అందుకు తగిన సామర్థ్యం, సొమ్ములు కనిపించడం లేదు.
దీంతో ఎలాగూ విభజన చట్టంలో పేర్కొన్నారు కనుక.. ఇది కేంద్ర ప్రాజక్టే కాబట్టి.. కేంద్రమే నిర్మించి ఇవ్వాలి కనుక.. ఇక, మనం చేతులు ఎత్తేసి.. ప్రాజెక్టును కేంద్రానికి అప్పగించేద్దామనే మూడ్‌లో సర్కారు ఉన్నట్టు తెలుస్తోంది. అంటే.. ఇక, పొలవరం నిర్మించే బాధ్యత..పూర్తిగా కేంద్రమే చూసుకోవాలి. నిజానికి జగన్ కనుక ఈ నిర్ణయం తీసుకుంటే.. ఇంతకన్నా చెత్త నిర్ణయం మరొకటి ఉండదని అంటున్నారు పరిశీలకులు.
రాజకీయంగా ఆయనకు ఇది పెద్ద దెబ్బగా మారడంతోపాటు.. రేపు టీడీపీ, బీజేపీల నుంచి కూడా చేతకాని ప్రభుత్వం, చేతకాని పాలకుడు అనే విమర్శలు ఎదుర్కొనాల్సి వస్తుందని అంటున్నారు. ఇక, రాష్ట్ర ప్రజల్లో కూడా ఈ విషయంలో జగన్‌పై ఒక అపప్రద ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు కూడా దీనిని చెత్త నిర్ణయంగా పేర్కొంటూ.. ఆఫ్‌ది రికార్డుగా దుమ్మెత్తి పోస్తుండడం గమనార్హం.