రాజకీయం అనేది ఎప్పుడెలా మారుతుందో ఎవరికీ అయినా అంచనా వేయడం అనేది కష్టమే. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తిరిగి సీఎం అవుతారని చాలామంది భావించారు. రాజకీయంగా అప్పుడు ఉన్న పరిస్థితులు, అదే విధంగా చంద్రబాబు నాయుడు చేసిన కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆయనను తిరిగి అధికారంలోకి తీసుకు వస్తాయని చాలామంది భావించారు. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అంచనాలన్నీ తలకిందులయ్యాయి. సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టారు. ఎవరూ ఊహించని విధంగా 151 స్థానాలతో సీఎంగా జగన్ పదవిలోకి రావడంతో రాజకీయ విశ్లేషకులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసిన సందర్భాలవి.
చంద్రబాబు నాయుడు ఎందుకు అధికారం కోల్పోయారని తర్వాత విశ్లేషణ చేస్తే చాలా కారణాలు కనిపిస్తాయి అందులో ప్రధానంగా కొందరికి చంద్రబాబు నాయుడు మితిమీరిన స్వేచ్ఛ ఇవ్వడం ప్రధాన కారణమైంది. పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న వారిని అదేవిధంగా ముందు నుంచి తనకు అండగా ఉన్న వారికి చంద్రబాబు నాయుడు చాలా వరకు ప్రాధాన్యత ఇచ్చారు. దీనితో పార్టీకి చాలా మంది నేతలు దూరమైన పరిస్థితి. చంద్రబాబు నాయుడుపై అసహనం లేకపోయినా క్షేత్రస్థాయిలో పార్టీపై పట్టు ఉన్న కొంతమంది నేతలు సీనియర్ నేతలతో ఉన్న విభేదాల కారణంగా పార్టీకి దూరం జరిగారు. దీనితో కీలకమైన ఓటుబ్యాంకు తెలుగుదేశం పార్టీకి దూరమైంది.
ఇప్పుడు కూడా సీఎం జగన్ అదే తప్పు చేస్తున్నారు అని ఆరోపణలు ఎక్కువగా వినబడుతున్నాయి. వైసీపీ పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో… పార్టీకి ముందు నుంచి అండగా ఉన్న నేతలకు.. సీఎం జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికంగా ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. రాయలసీమలో ఒక నేతకు జగన్ ఇస్తున్న ప్రాధాన్యత చూసి ఆ పార్టీ నేతల్లోనే చాలావరకు అసహనం ఉంది. ఆయన ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్నారు. రాయలసీమ మొత్తం ఆయన కనుసన్నల్లోనే ఉంటూ వస్తోంది. అయితే ఆయన చేస్తున్న కొన్ని పనులు సీఎం జగన్ ని చాలా వరకు కూడా ఇబ్బందులు పెడుతున్నాయి. ఆయన ఏది చేసినా సరే సీఎం జగన్ సైలెంట్ గా ఉంటున్నారు అని ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి.
ఇక ఉత్తరాంధ్రకు చెందిన మరో కీలక నేత విషయంలో కూడా దాదాపుగా ఇదే జరుగుతోంది. ముందు నుంచి సీఎం జగన్ కు అండగా ఉంటూ వస్తున్న ఒక కీలక నేత పార్టీలో అన్నీ తానై వ్యవహరించడమే కాకుండా సొంత నిర్ణయాలు కూడా ఎక్కువగా తీసుకుంటున్నారు అని, వైసీపీ నేతలు బహిరంగంగానే కొన్ని సందర్భాల్లో వ్యాఖ్యానించిన పరిస్థితి. దీనితో పార్టీకి ముందు నుంచి అండగా ఉన్న మరి కొందరు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజకీయంగా సీఎం జగన్ కు కష్టకాలం నడిచిన సమయంలో సదరు నేత అందించిన అండదండలు జగన్ కు ఉపయోగపడ్డాయి. దీనితోనే సీఎం జగన్ ఆయన విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని పార్టీ నేతలు కూడా భావిస్తున్నారు.
ఇలాంటి వ్యవహారాలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇవన్నీ కూడా భవిష్యత్తులో సీఎం జగన్ ను ఇబ్బంది పెట్టే అవకాశాలు లేకపోలేదు. గతంలో చంద్రబాబు నాయుడు ఇదేవిధంగా తన పార్టీ నేతలకు మితిమీరిన స్వేచ్ఛ ఇవ్వడం వాళ్ళు ఏమి చేసినా సరే చూసి చూడనట్టు వ్యవహరించడంతో పార్టీ బాగా ఇబ్బంది పడింది. ఆ ప్రభావం ఇప్పటికంటే ఎన్నికలు వచ్చిన సమయంలోనే ఎక్కువగా కనబడుతోంది. కాబట్టి సీఎం జగన్ ఇలాంటి వాటిని ముందుగానే గ్రహించి కట్టడి చేస్తే మినహా పార్టీనీ కొన్ని భవిష్యత్తు కష్టాల నుంచి బయటకు రావచ్చు అనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.