జ‌గ‌న్ ఇచ్చిన అలుసు.. ఈ స‌వాళ్ల వెనుక పాలిటిక్స్ ఇవే..!

-

ప్ర‌స్తుత రాజ‌కీయ ప‌రిణామాల్లో చిన్న పార్టీ పెద్ద పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలూ దూకుడుగానే ఉన్నాయి. నిజానికి ఎన్నిక‌ల్లో జీరో ఓటు బ్యాంకు పొందిన పార్టీలుకూడా సీఎం జ‌గ‌న్‌పైనా, వైసీపీ నేత‌ల‌పైనా తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. రా! చూసుకుందాం! అని కొంద‌రు అంటుంటే.. ఎన్నిక‌ల‌కు వెళ్దాం.. అక్క‌డ నీ ప్ర‌తాప‌మో.. మా ప్ర‌తాప‌మో చూసుకుందాం.. అని స‌వాళ్లు రువ్వుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అయితే, ఇలా మీసాలు తిప్పుతూ.. స‌వాళ్లు రువ్వే పార్టీల‌కు, నేత‌ల‌కు ఉన్న ఓటు బ్యాంకు ఎంత అని చూస్తే… 1 నుంచి 2 శాతం కూడా లేద‌నే చెప్పారు.

టీడీపీ నేత‌లు వ‌చ్చి అమ‌రావ‌తి కేంద్రంగా ఎన్నిక‌లు పెట్టు అంటే .. ఏదో ఒక అర్ధం ఉంటుంది. కానీ, చంద్ర‌బాబు నోటి నుంచి ఆ మాట రాదు. వ‌చ్చినా.. కేవ‌లం త‌న‌కు నొప్పిలేకుండా.. త‌న పార్టీ వారికి బాధ క‌ల‌గ‌కుండా.. మంగ‌ళ‌గిరి, తాడికొండ, తెనాలి వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌ల‌ను రాజీనామా చేయించి.. ఎన్నిక‌ల‌కు వెళ్తామంటారు. ఇక్క‌డ గెలిచింది వైసీపీ. ఆ పార్టీ నేత‌లే రాజ‌నామా చేసి.. అమ‌రావతిపై రెఫ‌రెండం కోరాల‌ని బాబు కోరుతున్నారు. ఇక‌, క‌మ్యూనిస్టు.. కామ్రెడ్స్ విష‌యానికి వ‌స్తే.. వారికి అస‌లు ఓటు బ్యాంకే లేదు.. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లారు.

పోనీ.. ఒక్క‌చోటైనా విజ‌యం మాట అటుంచి డిపాజిట్లు కూడా ద‌క్కించుకున్న‌ట్టు వార్త‌లు రాలేదు. ఈ పార్టీలు మాత్రం జ‌గ‌న్‌ను ఎన్నిక‌ల‌కు రావాల‌ని సవాళ్లు రువ్వ‌డం, పంతాలు ప‌ట్ట‌డం.. అమ‌రావ‌తిపై ప్ర‌జాభిప్రాయం అన‌డం విడ్డూరంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీలకులు. ఓటు బ్యాంకు లేనంత మాత్రాన మాట్లాడ‌కూడ‌ద‌ని, విమ‌ర్శించ‌కూడ‌ద‌ని కాదు.. కానీ, దానికి కూడా కొన్ని హ‌ద్దులు ఉండాలి. మ‌న‌కు ఓటు బ్యాంకే లేన‌ప్పుడు.. ఎన్నిక‌ల‌కు  పిలిచి.. ఏం లాభం. నిజంగానే అమ‌రావ‌తిపై ప్రేమ ఉంటే.. వేరే విధంగా స్పందించాలి. అయినా.. ఇలాంటి వ్యాఖ్య‌లు చేసే వ‌ర‌కు ప‌రిస్థితి రావ‌డం జ‌గ‌న్ నాన్చుడు ధోర‌ణే కార‌ణ‌మ‌నేది వైసీపీ సానుభూతి ప‌రుల మాట‌.

ఏదైనా విష‌యాన్ని అక్క‌డిక‌క్క‌డే తేల్చేయాల్సిన జ‌గ‌న్‌.. నాన్చుడు ధోర‌ణిని అవ‌లంభించ‌డం, విష‌యాన్ని విష‌యంగా వ్య‌క్తీక‌రించ‌క‌పోవ‌డం వంటివి ఆయ‌నకు సంక‌టంగా మారుతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఏదేమైనా రాజ‌కీయ నేత‌లు మాత్రం విమ‌ర్శ‌ల‌కు హ‌ద్దులు లేకుండా చేస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news