క్యాన్సర్ బాధితులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ప్రజారోగ్య చట్టం – 1939 ప్రకారం.. క్యాన్సర్ ను నోటిఫైడ్ వ్యాధిగా పేర్కొంటూ జగన్ ప్రభుత్వం.. నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణ బాబు నోటిఫికేషన్ ఇచ్చారు.
వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన, పరిశోధన, నియంత్రణ, చికిత్స తదితర అంశాలపై ప్రత్యేక దృష్టిసారించేలా కార్యచరణ చేపట్టనున్నట్లు నోటిఫికేషన్ లో జగన్ సర్కార్ స్ఫష్టం చేసింది. వ్యాధి గురించి అవగాహన లేకపోవడంతో వెల్లడికాని కేసుల సంఖ్య పెద్ద ఎత్తున ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పింది.
క్యాన్సర్ గుర్తింపు, సరైన సమయానికి ఆస్పత్రుల్లో చికిత్స, వ్యాధి నియంత్రణ తదితర అంశాలపై ప్రత్యేక విధానం రూపొందించాల్సి ఉందని వెల్లడించింది. ఇక నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు, పాథోలాజికల్ ల్యాబులు, రేడియాలజీ ల్యాబులు.. క్యానర్ వ్యాధిని రిపోర్టు చేయాల్సిందిగా సూచిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది సర్కార్.