తార‌క్‌ వర్సెస్ లోకేష్‌: టీడీపీని నిలబెట్టే వారసుడు ఎవరు…?

తెలుగువారి ఆత్మగౌరవం అంటూ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి, ఏపీ రాజకీయాలతో పాటు, కేంద్ర రాజకీయాలని శాసించారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది అందరికీ తెలిసిందే. నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడ్, నెక్స్ట్ అనూహ్య పరిణామాల మధ్య పార్టీని ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు తీసుకోవడం జరిగాయి. అప్పుడు పార్టీని చేతిలోకి తీసుకున్న చంద్రబాబు, ఇప్పటికీ పార్టీ పగ్గాలు తన దగ్గరే ఉంచుకున్నారు.

అయితే భవిష్యత్‌లో తన కుమారుడు లోకేష్‌కు పార్టీ పగ్గాలు ఇవ్వాలనే దిశగా చంద్రబాబు పావులు కదుపుతున్న విషయం కూడా తెలిసిందే. అందుకే 2014లో అధికారంలోకి వచ్చాక లోకేష్‌ని ఎమ్మెల్సీని చేసి, మంత్రిగా చేశారు. కానీ ఇలా చేయడం వల్ల టీడీపీకి బెన్‌ఫిట్ ఏమన్నా వచ్చిందా అంటే లేదనే చెప్పొచ్చు. లోకేష్ నాయకత్వం సమర్ధవంతంగా ఉంటే 2019 ఎన్నికల ఫలితాలు వేరేగా ఉండేవి. ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. దీంతో జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే పార్టీ నిలబడుతుందనే వాదన తెరపైకి వచ్చింది.

సొంత పార్టీలోనే కొందరు నేతలు ఇలాంటి వాదన తీసుకొస్తుండగా, ప్రత్యర్ధి పార్టీలో ఉన్న కొడాలి నాని సైతం జూనియర్ వస్తేనే పార్టీ బ్రతికే ఛాన్స్ ఉందన్నట్లు మాట్లాడుతున్నారు. మామూలుగా అయితే సీనియర్ ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ బాధ్యతలు వారసత్వంగా హరికృష్ణ గానీ, బాలకృష్ణ గానీ దక్కాలి. కానీ చంద్రబాబు పార్టీని తన చేతుల్లోకి తీసుకోవడంతో, ఆయన వారసుడు చేతిలో పార్టీ పగ్గాలు పెట్టాలని చూస్తున్నారు. అయితే లోకేష్‌కు పార్టీని నడిపించే సమర్ధత ఎంత ఉందో అర్ధమైపోతుంది. అందుకే టీడీపీకి నిజమైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అని అంతా భావిస్తున్నారు.

పైగా ఆయన స్టామినా ఏంటో 2009 ఎన్నికల్లోనే తెలిసిపోయింది. ఆ స్టామినాకు భయపడే తన వారసుడుకు ఎక్కడ ఇబ్బందుకు వస్తాయని చెప్పి, బాబు జూనియర్‌ని పక్కనబెట్టేశారు. ఎంత పక్కనబెట్టిన రానున్న రోజుల్లో టీడీపీ పగ్గాలు జూనియర్ చేపడితేనే పార్టీ నిలబడుతుంది. అందుకే కొడాలి లాంటి వారు కూడా ఎన్టీఆర్ ఖచ్చితంగా రాజకీయాల్లోకి వస్తారని, బాబు టీడీపీ బాధ్యతలు అప్పగిస్తే ఓకే అని, లేదంటే కొత్త పార్టీ పెట్టినా పెట్టొచ్చు అన్నట్లు మాట్లాడుతున్నారు.

కొడాలి ఓ రకంగా మైండ్ గేమ్ ఆడుతూ, ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. కొడాలినే కాదు టీడీపీలో ఎక్కువ శాతం కేడర్ ఎన్టీఆర్‌కే పార్టీని నడిపించే స్టామినా ఉందని భావిస్తున్నారు. ఏదేమైనా లోకేష్ కంటే ఎన్టీఆర్‌నే టీడీపీని నడిపించే సత్తా గల వారసుడు అని అనుకుంటున్నారు.

 

-vuyyuru subhash