పద్మావతి యూనివర్సిటీలో కేఏ పాల్‌ హంగామా

-

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ మంగళవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో హంగామా చేశారు. సాయంత్రం 6 గంటల సమయంలో పాల్‌కు సంబంధించిన 5 వాహనాలు విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించాయి. అనుమతి లేకుండా వస్తున్న వాహనాలను అడ్డుకున్న సెక్యూరిటీని బెదిరించిన ఆయన.. నేరుగా వర్సిటీలోకి వచ్చేశారు.

రహదారిపై వాహనాలను ఆపి విద్యార్థినులను పిలిచి మాట్లాడారు. వారితో సెల్ఫీలు దిగారు. విద్యార్థినులతో వారి తల్లిదండ్రులకు ఫోన్లు చేయించి వారితో మాట్లాడారు. అనుమతి లేకుండా వర్సిటీలోకి ప్రవేశించిన ఆయనపై యూనివర్సిటీ అధికారులు ఎమ్మార్‌ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వర్సిటీకి చేరుకుని పాల్‌కు చెందిన 5 వాహనాలను బయటకు వెళ్లకుండా ఆపేశారు. లోపలికి ఎందుకు ప్రవేశించారని ప్రశ్నించారు.

కారు దిగి స్టేషన్‌కు రావాలని కేఏ పాల్‌ను పోలీసు అధికారులు కోరగా. తాను దిగనని, తన కారులోనే స్టేషన్‌కు వస్తానంటూ.. తన వాహనంలోనే ఉండిపోయారు. ఆ తరవాత కొద్దిసేపటికి ఆయనను పంపించారు. అనుమతి లేకుండా విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించిన పాల్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

అంతకు ముందు తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో కేఏ పాల్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో చంద్రబాబు, కేసీఆర్‌, జగన్‌ పార్టీలకు డిపాజిట్లు కూడా దక్కవని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను విజయం సాధిస్తానని, ఏపీ ముఖ్యమంత్రిగా మహిళను చేస్తానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news