నారా లోకేష్ పాదయాత్రపై ఏపీ పోలీసులు స్పందించారు. లోకేష్ పాదయాత్రకు సంబంధించి డీటైల్డ్ రూట్ మ్యాప్ అడిగారు ఏపీ డీజీపీ. ఈ మేరకు వర్ల రామయ్యకు లేఖ రాశారు డీజీపీ. పాదయాత్ర జరిగే తేదీ, ఎంత మంది పాల్గొంటారనే వివరాలను కోరిన డీజీపీ…పాదయాత్రలో ఉపయోగించే వాహానాల వివరాలు, ఎక్కడ నైట్ హాల్ట్ ఉండబోతోందనే వివరాలు కావాలంటూ లేఖ పంపారు.
పాదయాత్ర బాధ్యుల ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వాలని కోరిన డీజీపీ…ఇవాళ ఉదయం 11 గంటల్లోగా డీజీపీ కార్యాలయంలో వివరాలు అందివ్వాలన్నారు. ఈ స్థాయిలో వివరాలు కోరడంపై టీడీపీలో అనుమానాలు నెలకొంటున్నాయి. గతంలో జగన్ పాదయాత్రకు ఇన్ని వివరాలు ఇచ్చారా..? అంటూ పార్టీలో చర్చ జరుగుతోంది. పాదయాత్రకు అసలు అనుమతులే అవసరం లేదంటూ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు టీడీపీ నేతలు.