ఆంధ్రప్రదేశ్ జెలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆదివారం పోలవరం ప్రాజెక్టుని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సీజన్ లో పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని వివరించారు. చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం ప్రాజెక్టుకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. వరదల కారణంగా డయాఫ్రమ్ వాల్ 485 మీటర్ల మేర దెబ్బతిన్నదని, పెద్ద గుంతలు ఏర్పడ్డాయని, వీటిని సరి చేస్తే మిగతా పనులు ముందుకు సాగుతాయని అన్నారు.
ఈ మరమ్మత్తు పనులకే రెండు వేల కోట్లు అవసరమని స్పష్టం చేశారు. పోలవరం పై రాజకీయ ఆరోపణలు చేయడం లేదని చెప్పారు. కాపర్ డ్యాం పూర్తి చేయకుండా డయాఫ్రమ్ వాల్ వేయడం వల్ల ఇంత నష్టం జరిగిందని ఆరోపించారు. దీనిపై నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ అధ్యయనం చేసిందని, ఇటీవలే నివేదిక కూడా వచ్చిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎవరిపై చర్యలు తీసుకోవాలన్నది త్వరలోనే నిర్ణయిస్తామని స్పష్టం చేశారు.