కొడాలి డైవర్షన్ పాలిటిక్స్…అమరావతి టార్గెట్ ఎందుకు..?

-

‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వని చోట రాజధాని కూడా వద్దు’ ఇది మంత్రి కొడాలి నాని స్టేట్‌మెంట్. పేదలకు ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా ఏపీ ప్రభుత్వం అమరావతిలోని భూములని కేటాయించింది. అది కూడా కృష్ణా, గుంటూరు జిల్లాలో ఇతర ప్రాంతాల్లో ఉన్నవారికి అమరావతిలో ఇళ్ల పట్టాలు ఇద్దామని అనుకుంది. అయితే రాజధాని కోసం ఇచ్చిన భూములని ఇళ్ల పట్టాలకు ఎందుకు ఇస్తామని చెప్పి, కొందరు రైతులు కోర్టుకు వెళ్లారు. దీంతో కోర్టు రైతులకు అనుకూలంగా తీర్పు ఇస్తూ, ప్రభుత్వం ఆదేశాలకు బ్రేక్ వేసింది. అదిగో టీడీపీ నేతలే కావాలని కోర్టుకు వెళ్ళి రాజధానిలో పేదలకు భూములు ఇవ్వకుండా చేస్తుందని, అసలు పేదలకు భూములు ఇవ్వని చోట రాజధాని కూడా వద్దని చెబుతూ కొడాలి కామెంట్స్ చేశారు.

అలాగే జగన్‌కు చెప్పి, అమరావతిలో శాసన రాజధాని పెట్టొద్దని చెబుతానని మాట్లాడారు. ఇక కొడాలి ప్రకటనలపై రాజధాని రైతులు ఫైర్ అవుతున్నారు. అసలు రాజధాని కోసం కొడాలి ఎకరం అయినా ఇచ్చారంటూ నిలదీస్తూ, గత ప్రభుత్వ హయాంలో పేదల కోసం నిర్మించిన 5 వేల ఇళ్లని పంచి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని, అయినా తాము రాజధాని కోసం భూములు ఇచ్చామని, ఇళ్ల పట్టాల కోసం కాదని చెబుతున్నారు. అయితే ఇళ్ల పట్టాల గురించి ఏ వైసీపీ నాయకుడు కూడా పెద్దగా స్పందించడం లేదు. కానీ కొడాలి మాత్రం అమరావతిని టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నారు.

అమరావతికి దగ్గరగా ఉన్న కొడాలి ఇలా మాట్లాడటం వెనుక ఏదో కుట్ర ఉందని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. జగన్ మనసులో ఉన్న భావాన్ని కొడాలి చెబుతున్నారని, అమరావతిలో రాజధాని లేకుండా చేయడమే జగన్ లక్ష్యమని అర్ధమవుతుందని టీడీపీ నాయ‌కులు ఆరోపిస్తున్నారు. ఎంతో సున్నిత‌మైన రాజ‌ధాని విష‌యంలో ఇప్ప‌టికే అనేక వివాదాలు న‌డుస్తున్నాయి. ఈ స‌మ‌యంలో నాని ఇంత డేరింగ్‌తో ఈ వ్యాఖ్య‌లు చేయ‌డంతో ఇది జ‌గ‌న్‌కు తెలిసే జ‌రిగిందా ?  లేదా ?  ఇది నాని సొంత అభిప్రాయ‌మా ? అన్న చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి.

పైగా కొడాలి ఈ టాపిక్ తెరపైకి తీసుకొచ్చి, బూతులు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇతర సమస్యలని పక్కదోవ పట్టించే కార్యక్రమం చేస్తున్నారని, ప్రధానం రైతుల విద్యుత్ మీటర్లు, అంతర్వేది ఘటనలని డైవర్ట్ చేసేందుకే కొడాలి ఇలాంటి రాజకీయం చేస్తున్నారని చెబుతున్నారు. మొత్తానికైతే కొడాలి డైవర్షన్ పాలిటిక్స్ బాగానే చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Latest news