అమరావతిలో భూ కుంభకోణం జరిగిందని వైసీపీ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం్ తెలిసిందే. రాజధాని అక్కడే ఏర్పాటు కాబోతోందని తెలిసి కొంత మంది టీడీపీ నేతలు బినామీల పేర్లతో కోట్ల భూముల్ని కొన్నారని దీనిపై సీబీఐ విచారణ జరగాల్సిందేనని ఆరోపణలు చేసిన వైసీపీ వర్గాలు ఎట్టకేలకు సీఐడీ విచారణ మొదలుపెట్టారు.
అయితే దీనికి ఆదిలోనే అంతరాయం ఏర్పడింది. సీఐడీ విచారణని నిలిపివేస్తూ రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ సందర్భంగా వైసీపీ నేతలు తమ నిరసనని తీవ్ర స్థాయిలో వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా ముందుకొచ్చిన కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, ఆయన బినామీలు, చంద్రబాబు తను అధికారంలో వుండగా వివిధ కీలక సంస్థల్లో కొంత మందిని ఏర్పాటు చేశారు. వారంతా ఇప్పుడు రాజధాని భూ కుంభకోణంపై జరుగుతున్న విచారణని ఆపడం ముర్ఖత్వమే అవుతుందని హెచ్చరించారు.
కుంభ కోణం బయటికి రాకుండా అడ్డుపడుతున్న ముసుగు దొంగల్ని బయటికి లాగుతామని, రాజధాని భూ కుంభకోణం పై విచారణకు ఆదేశిస్తే ముత్యాల్లా బయటికి వస్తామన్న చంద్రబాబు ఇప్పుడెందుకు భయపడుతూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు కొడాలి నాని. ఇంతకీ నాని చెప్పిన ముసుగు దొంగలెవరు అన్నది ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ నాయకులా లేక చట్ట సభల్లో పేరున్న హోదాల్లో వున్న వ్యక్తులా అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోంది.