ఇటీవల సీఎం జగన్ వైసీపీలో ఇన్చార్జిలను మార్చిన సంగతి తెలిసిందే. ఈ విషయం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. అయితే తాజాగా వైసీపీలో నియోజకవర్గ ఇన్చార్జిల మార్పుపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అనకాపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన సీటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తనకి సీటు ఇచ్చినా.. ఇవ్వకపోయినా.. పోటీ చేయవద్దని చెప్పినా సరే తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
నియోజకవర్గ ఇన్చార్జులను ప్రకటించినా సరే వారు ఎమ్మెల్యే అభ్యర్థులు కాలేరని అన్నారు అమర్నాథ్. ఫైనల్ గా సీఎం జగన్ ఎవరికి అయితే బి ఫామ్ ఇస్తారో వారు మాత్రమే ఎమ్మెల్యేలు అవుతారని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం సీట్ల మార్పు ఉంటుందని ముఖ్యమంత్రి ముందే మాకు స్పష్టం చేశారని చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రికి 175 మంది ఎమ్మెల్యేల కన్నా రాష్ట్ర ప్రజల భవిష్యత్ ముఖ్యమని అన్నారు అమర్నాథ్. రాష్ట్రంలో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.