భారత రాష్ట్ర సమితి పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా. ఆంధ్రప్రదేశ్ లో మరికొన్ని రోజులలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తిరుపతిలో వైసీపీ మంత్రులు, కీలక నేతలు భేటీ అయ్యారు. ఎయిర్ బైపాస్ రోడ్డులోని పిఎల్ఆర్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ సమావేశానికి మంత్రి ఆర్కే రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి రోజా మాట్లాడుతూ.. రాజకీయాలలో ఎవరైనా పార్టీ పెట్టొచ్చని, ఎన్నికలలో పోటీ చేసి ప్రజల మద్దతుతో గెలవచ్చని అభిప్రాయపడ్డారు.
పార్టీ సిద్ధాంతాలు, మేనిఫెస్టో, రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారో చెప్పి వారిని ఒప్పించగలిగితే జయప్రదం అవుతారని అన్నారు. పవన్ కళ్యాణ్ తో బిఆర్ఎస్ కలిసి పోటీ చేస్తారని, 100 కోట్ల ప్యాకేజీ పవన్ కళ్యాణ్ కి అందిందని ప్రచారం జరుగుతుందని ఆరోపించారు. ఇక నారా లోకేష్ పాదయాత్ర విఫలమైన నేపథ్యంలో.. వారాహి తో పవన్ కళ్యాణ్ ఎక్కడ హీరో అయిపోతాడేమోనని భయపడుతున్నారని అన్నారు. అందుకే పవన్ కళ్యాణ్ పై విషం చిమ్ముతున్నారని మంత్రి రోజా ఆరోపించారు.