ఆ వైసీపీ మంత్రికి షాక్ ఇస్తోన్న సొంత పార్టీ నేత‌లు..!

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌లేం. పార్టీ అధినేత సానుకూలంగానే ఉన్నా.. కింది స్థాయినాయ‌కుల వ్య‌వ‌హార శైలిలో ఒక్కోచోట ఒక్కొక్క విధంగా ఉంటుంది. గ‌తంలో టీడీపీ హ‌యాంలోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి ఉంది. ఇప్పుడు వైసీపీలోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లే తెర‌మీదికి వ‌స్తున్నాయి. దీంతో కీల‌క స్థానాల్లో ఉన్న నాయ‌కులు, మంత్రులకు చుక్క‌లు క‌నిపిస్తున్నాయి. ఈ ప‌రిణామాల‌తో వారు.. కుత‌కుత‌లాడిపోతున్నారు. ఇలాంటి ప‌రిస్థితే ఇప్పుడు అనంత‌పురం జిల్లా పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన మాల‌గుండ్ల శంక‌ర‌నారాయ‌ణ‌కు కూడా ఎదుర‌వుతోంద‌ని చెబుతున్నారు ఆయ‌న అనుచ‌రులు. బీసీ వ‌ర్గానికి చెందిన శంక‌ర నారాయణ‌కు జ‌గ‌న్ త‌న కేబినెట్‌లో ఛాన్స్ ఇచ్చారు.

ysrcp mla doctor sudhakar tesed corona positive

సౌమ్యుడు, నిరాడంబ‌రుడు, వివాద ర‌హితుడుగా శంక‌ర‌నారాయ‌ణ పేరు తెచ్చుకున్నారు. అనంత‌పురం జిల్లాలో టీడీపీకి కంచు కోట అయిన పెనుకొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి శంక‌ర‌నారాయ‌ణ తొలిసారి విజ‌యం సాధించారు. అంతేకాదు, ఇక్క‌డ బ‌ల‌మైన టీడీపీ ఓటు బ్యాంకును సైతం వైసీపీ వైపు మ‌ళ్లేలా.. ఏళ్ల త‌ర‌బ‌డిక‌ష్ట‌ప‌డ్డారు. ఈ క‌ష్టానికి గుర్తింపుగానే జ‌గ‌న్ ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టారు. ఇంత వ‌రకు బాగానే ఉన్నా.. ఆయ‌న‌కు స్థానికంగా నాయ‌కుల నుంచి ఎదురీత ఎద‌ర‌వుతోంది. జిల్లా పెత్త‌నం అంతా కూడా రెడ్డి వ‌ర్గం చేతుల్లోనే ఉంది. దీంతో అన్ని నిర్ణ‌యాల‌ను వారే తీసుకుంటున్నారు. వారి క‌నుస‌న్న‌ల్లోనే ప‌నులు జ‌రిగిపోతున్నాయి.

నిజానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా జిల్లా నుంచి ప్రాధాన్యం ఉన్న‌ప్ప‌టికీ.. ఏదో ప్రొటోకాల్ మేర‌కు ఆయ‌న‌కు గౌర‌వం ద‌క్కుతోం దే త‌ప్ప‌.. పార్టీ ప‌రంగా, నాయ‌కుల ప‌రంగా శంక‌ర‌నారాయ‌ణ డీగ్రేడ్ అయ్యార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామంతో ఆయ‌న తీవ్ర‌స్థాయిలో మాన‌సికంగా కుంగిపోతున్నారు. పోనీ.. ఇదే విష‌యాన్ని జ‌గ‌న్‌కు చెబుదామంటే.. ఏకంగా ఆయ‌న‌కు ప‌ద‌వే అడ్డం వ‌స్తోంది. `అన్నా నువ్వు మంత్రివి. అక్క‌డి ప‌రిస్థితుల‌ను నువ్వే చ‌క్క‌దిద్దాలి. అంతా నేనే చూడాలంటే ఎలా?` అని జ‌గ‌న్ ఎద‌రు ప్ర‌శ్నిస్తే.. త‌న ప‌రిస్థితి ఏంట‌నేది కూడా శంక‌ర‌నారాయ‌ణ‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

భారీగా ఉన్న రెడ్డి సామాజిక వ‌ర్గంలో తాను ఒంట‌రి పోరు చేస్తున్నా.. ఎక్క‌డా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మంత్రిగారు తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నార‌ని జిల్లా రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి. మ‌రి ఈ ప‌రిస్థితి ఎన్నాళ్లు కొన‌సాగుతుందో చూడాలి.