ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ.. ఆడేసుకుంటున్నారా ? ఆయనతో తెరచాటు చెలిమి చేస్తున్నట్టు కనిపిస్తూనే.. చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తూనే.. లోపాయికారీగా.. వ్యవహరిస్తూ.. ఇరుకున పెడుతున్నారా ? అంటే.. తాజా పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. కేంద్రంలోని మోడీ సర్కారు ఏం కావాలన్నా జగన్ చేస్తున్నారు. అన్ని విషయాల్లోనూ కేంద్రానికి ఆయన మద్దతిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికలు ఉపరాష్ట్రపతి ఎన్నికలు సహా కేంద్రం తీసుకువచ్చిన అనేక వివాదాస్పద బిల్లుల విషయంలోనూ జగన్ వెనుకా ముందు ఆలోచించుకుండా .. తన ఎంపీలతో మద్దతు పలికించారు.
ఇక, రాజ్యసభ ఎన్నికల్లో నూ తమకు అనుంగు మిత్రుడైన.. ముఖేష్ అంబానీ స్నేహితుడు నత్వానీకి ఓ టికెట్ ఇవ్వాలని కోరితే.. జగన్ ఇచ్చేశారు. మరి ఇంతగా జగన్ సహకరిస్తుంటే.. మోడీ ఇలానే వ్యవహరిస్తున్నారా? జగన్‌కు అనుకూలంగా ఉన్నారా? అంటే.. ఉన్నట్టే కనిపిస్తున్నారు.. కానీ, లేనట్టే వ్యవహరిస్తున్నారు అంటున్నారు పరిశీలకులు. దీనికి ప్రధానంగా రెండు మూడు విషయాలు వెలుగు చూస్తున్నాయి. జగన్ పట్టుబడుతున్న ప్రత్యేక హోదాపై ఇప్పటి వరకు మోడీ మాట మాత్రంగా కూడా మాట్లాడలేదు. ఇక, పోలవరం నిధులకు సంబంధించి కూడా ఆశించిన విధంగా కేంద్రం వ్యవహరించడం లేదు.
ఇప్పుడు తాజాగా కేంద్రం రాజధాని విషయంలో ఇచ్చిన అఫిడవిట్.. పైకి మాత్రం జగన్‌కు అనుకూలంగా అనిపిస్తోంది. రాజధాని అని విభజన చట్టంలో ఉంటే.. అది ఒక్కరాజధాని మాత్రమేనని కాదని మాత్రం పేర్కొన్న కేంద్రం నిధుల విషయంలో మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇప్పటికేతాము రెండు వేల కోట్లకు పైగా ఇచ్చామని పేర్కొంది. అదేస మయంలో మూడు రాజధానులకు అవసరమైతే.. నిధులు ఇస్తారా? అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు.
ఇక, నేరుగా జగన్ నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్టు కూడా చెప్పలేదు. మొత్తంగా ఈ విషయంలో తమ చేతులకు మట్టి అంటకుండా వ్యవహరించాలనేది మోడీ వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ఇది అంతిమంగా జగన్‌కు మేలు కన్నా కీడే ఎక్కువగా చేస్తుందని అంటున్నారు పరిశీలకులు.
-vuyyuru subhash