మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ ను రద్దు చేయాలంటూ వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మంగళవారం ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా తన పిటీషన్ పై తానే స్వయంగా వాదనలు వినిపించింది సునీతారెడ్డి.
సునీతకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా ను అనుమతించింది. అవినాష్ రెడ్డి సిబిఐ విచారణకు హాజరు కావడం లేదని సునీత న్యాయస్థానానికి విన్నవించింది. అయితే అవినాష్ రెడ్డి కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమా..? లేదా..?.. విచారణకు సహకరిస్తున్నాడా లేదా అన్నది దర్యాప్తు సంస్థ వ్యవహారమని కోర్టు చెప్పింది. ఈ కేసులో సిబిఐ విచారణ సేకరించిన పలు సాక్షాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదని సునీత సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది.
ఈ కేసును జూన్ 30లోగా ముగించాలని సుప్రీంకోర్టు స్వయంగా చెప్పిందని.. అందుకే ఈ లోపు పిటిషన్ పై విచారణ జరగాల్సిన అవసరం ఉందని వాదించింది సునీత. అయితే ఇంకో ధర్మసనం పెట్టిన డెడ్ లైన్ ను తాము మార్చలేమన్న సుప్రీం.. దర్యాప్తు సంస్థకు తన వాదన వినిపించే అవకాశం ఇవ్వాలని సూచించింది. ఈ సందర్భంగా పిటిషనర్ కోరినందున తదుపరి విచారణని జూన్ 19 కి వాయిదా వేస్తున్నామని చెప్పింది.