ఏపీ రాజకీయాల్లో చిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. అధికార పక్షం వైఎస్సార్ సీపీపై అదే పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు నుంచి ప్రతిపక్ష నేతలు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. జగన్ పథకాలను, కార్యక్రమాలను కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జగన్ అహంభావి అని.. ఎవరినీ లెక్కచేయరని.. అంటూ వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. జగన్‌ను తిడుతున్న వారంతా.. అదేసమయంలో ఆయన తండ్రి.. వైఎస్ రాజశేఖరరెడ్డిని మాత్రం కొనియాడుతున్నారు.
వైఎస్ దేవుడని, ఆయనకు క్రమశిక్షణ ఉందని.. రఘురామరాజు వంటివారు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవల ఆయన తన మనవడికి వైఎస్ పేరు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందో కూడా వివరించారు. అదే సమయంలో జగన్‌ను మాత్రం తీవ్రస్థాయిలో దుయ్యబడుతున్నారు. ఈ తరహా రాజకీయం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నోటి నుంచి కూడా విన్నాం. జగన్ కన్నా..వైఎస్ వంద రెట్లు బెటరని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేతకు విలువ ఇచ్చారని చెప్పుకొచ్చేవారు బాబు.
అయితే, ఈ తరహా వ్యూహానికి కారణం ఏంటి? వైఎస్ తనయుడిపై వైఎస్‌ను అడ్డుపెట్టి చేస్తున్న దాడి వెనుక ప్రత్యేక వ్యూహమేదైనా ఉందా? అంటే.. ఖచ్చితంగా వైఎస్‌ను అభిమానించే వారికి.. జగన్‌ను దూరం చేయాలనే పెద్ద కుట్ర కోణం ఖచ్చితంగా ఉందనే అంటున్నారు పరిశీలకులు. సెప్టెంబరు 2 వైఎస్ జయంతి సందర్భంగా వైఎస్ అభిమానులు అందరూ కూడా ఆయన కుటుంబంపై సింపతీ చూపించాలని భావిస్తారు. కానీ, ఈ సింపతీని ఏదో ఒక రకంగా డైల్యూట్ చేయడం ద్వారా.. జగన్‌ను విలన్‌గా చూపించే వ్యూహం సక్సెస్ అవుతుందనేది వీరి వ్యూహం.
ఇక జగన్‌ను ప్రతి రోజు తిడుతోన్న రఘురామ రాజు లాంటి వాళ్లు కూడా ఇలాంటి వ్యాఖ్యల ద్వారా జగన్ ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తూ టీడీపీకి మరింత వంత పాడుతున్నారు. మొత్తానికి వైఎస్ బతికుండా ఆయనను ఆడిపోసుకున్న నోళ్లే.. ఇప్పుడు ఆయనను కొనియాడుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే జగన్‌ను విలన్‌ను చేసే వ్యూహానికి నాయకులు బాగానే పదును పెంచారని అంటున్నారు పరిశీలకులు.
-vuyyuru subhash