ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈనెల 27 నుంచి నారా లోకేష్ యువగళం పేరుతో కుప్పం నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న విషయం తెలిసిందే. అయితే తనను ఆశీర్వదించాలంటూ ఈ లేఖలో ప్రజలను కోరారు నారా లోకేష్.
ఏపీలో ప్రశ్నించే ప్రతిపక్షం పై అక్రమ కేసులు, దాడులు చేస్తున్నారని, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాక్షస పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ బాదుడే బాదుడు పాలనలో బాధితులు కాని వారు ఎవరూ లేరని అన్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు ఎలాగూ రావడం లేదని.. ఉన్న పరిశ్రమలు కూడా తరిమేస్తున్నారని మండిపడ్డారు. ఈ అరాచక పాలన పోవాలని.. అందుకే మీ ముందుకు వస్తున్నానని అన్నారు.
” యువతకి భవితనవుతాను, అభివృద్ధికి వారధిగా నిలుస్తాను, రైతన్నని రాజుగా చూసే వరకు విశ్రమించను, ఆడబిడ్డల సోదరుడిగా రక్షణ అవుతాను, మీరే ఒక దళమై, బలమై నా యువగలం పాదయాత్ర ని నడిపించండి. మీ అందరి కోసం వస్తున్న.. నన్ను ఆశీర్వదించండి, ఆదరించండి” అంటూ ప్రజలను కోరారు.