ప్రజలు, ఖాతాదారులకు అలర్ట్. రెండువేల నోట్ల ఉపసంహరణతో నయా మోసం వెలుగులోకి వచ్చింది. రూ.2000 నోట్ల ఉపసంహరణతో దుండగులు కొత్త తరహా మోసానికి తెరలేపారు. రూ. 500 నోట్లను ఇస్తే అందుకు అదనంగా రూ. 2000 నోట్లు ఇస్తామని… రూ. 50 లక్షలు ఎత్తుకెళ్లిన ఘటన బి.ఆర్.అంబేద్కర్ జిల్లాలో జరిగింది.
జిల్లాలోని మండపేటకు చెందిన లక్ష్మీనారాయణకు రూ. 50 లక్షల విలువైన రూ. 500 నోట్లు ఇస్తే… రూ. 60 లక్షల విలువైన రూ. 2000 నోట్లు ఇస్తామని ఆశ చూపారు. వాటిని తీసుకువెళ్లిన తర్వాత బాధితున్ని బెదిరించి డబ్బు ఎత్తుకెళ్లారు. కాగా,కొన్నేళ్ల క్రితం పెద్ద నోట్ల రద్దయినప్పుడు బ్యాంకులకు కరెన్సీ కష్టాలు వచ్చింది చూశాం. ఇప్పుడు రెండువేల నోట్ల రద్దుతో మళ్లీ బ్యాంకులు ఆపసోపాలు పడుతున్నాయి. రూ.2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చలామణి నుంచి ఉపసంహరిస్తున్న నేపథ్యంలో వాటిని మార్చి ఇచ్చేందుకు ఆయా బ్యాంకు శాఖల్లో నోట్ల కొరత ఏర్పడుతోంది.