తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ రోజురోజుకీ పెరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ జనాల్లో టెన్షన్ రేపుతోంది. లాక్ డౌన్ ఉన్నన్నాళ్ళు కాస్త కట్టడిలోనే ఉన్న కేసులు లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో భారీగా నమోదవుతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా కరోన బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త, జగన్ మీద ఎన్నికల్లో పోటీ చేసిన పాలెం శ్రీకాంత్ రెడ్డి కరోనాతో మృతి చెందారు.
హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చెన్నకేశవ రెడ్డి కుమారుడయిన ఈయనకి కరోనా సోకడంతో హైదరాబాద్ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈయన 2009 ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా జగన్ మీద పోటీ చేశారు. ఇక ఈయన తండ్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పాలెం చెన్నకేశవరెడ్డి కూడా ఫిబ్రవరిలోనే కన్నుమూశారు. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లోని తన నివాసంలో ఆయన సహజ మరణం పొందారు.