కులాలను కలపడమే జనసేన విధానం – పవన్‌ కళ్యాణ్‌

-

కులాలను కలపడమే జనసేన విధానం అని పేర్కొన్నారు పవన్‌ కళ్యాణ్‌. దేశంలో కుల సమస్య… కులాలపై శాస్త్రీయ అవగాహన.. వాటి పుట్టుపూర్వోత్తరాలు సాంస్కృతిక జీవనం గురించి సాధికారికంగా విశాల దృక్పథంతో మాట్లాడిన మహనీయులు శ్రీ రామ్ మనోహర్ లోహియా గారు. ఆయన ప్రతిపాదించిన సోషలిస్ట్ సిద్ధాంతాలను అర్థం చేసుకొంటే అన్ని వర్గాల ప్రజలు సామరస్య భావనతో ముందుకు వెళ్తారని తెలిపారు పవన్‌ కళ్యాణ్‌.

సమసమాజ స్థాపన కోసం తపించిన ఆ మహానుభావుడి జయంతి సందర్భంగా హృదయపూర్వక అంజలి ఘటిస్తున్నాను. జనసేన పార్టీ సిద్ధాంతాలపైనా… పోరాట పంథాపైనా శ్రీ రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతాలు, ఆలోచన ప్రభావం ఉంది. ఎలుగెత్తు… ఎదిరించు.. ఎన్నుకో… అనే జనసేన పోరాట విధానానికి శ్రీ రామ్ మనోహర్ లోహియా గారి సిద్ధాంతాలే స్ఫూర్తి అన్నారు. కులాలను కలిపే ఆలోచనా విధానం అనేది జనసేన సిద్ధాంతాల్లో ఒకటి. శ్రీ లోహియా గారు చెప్పిన విధంగా కులాల మధ్య అంతరాలు తగ్గించడం వర్తమాన సమాజానికి ఎంతో శ్రేయస్కరం అని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ కుల వ్యవస్థపై శ్రీ లోహియా గారికి సాధికారత ఉంది. ఆయన ఇక్కడి కుల విధానాలు గురించి చెబుతూ రాజ్యాధికారానికి దూరంగా ఉన్న కులాలు ఏ విధంగా ముందుకు వెళ్లాలో ‘ది క్యాస్ట్ ఇన్ ఇండియా’ పుస్తకంలో వివరించారు. కేవలం కుల వ్యవస్థపైనే కాదు మహిళా సాధికారతతో భారతీయ సమాజ వికాసం గురించి కూడా ఎంతో విపులంగా చెప్పారు. శ్రీ లోహియా గారు సిద్ధాంతాలు ప్రతిపాదించడమే కాదు వాటిని తన ప్రజా జీవితంలో ఆచరించి చూపారు. వర్తమాన సమాజం… ముఖ్యంగా యువత శ్రీ లోహియా గారి సిద్ధాంతాలు అర్థం చేసుకొంటే కులాల సంక్లిష్టత నుంచి బయటపడవచ్చని తెలిపారు పవన్‌ కళ్యాణ్‌.

Read more RELATED
Recommended to you

Latest news