జగన్ దగ్గరకు ఫోన్ ట్యాపింగ్ పంచాయితీ.. ఆమెకే ప్లస్ ?

గుంటూరు జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య వివాదమే ఈ ఫోన్ ట్యాపింగ్ వరకు వెళ్లిందా? లేక ఈ ట్యాపింగ్ వెనుక ఇంకెవరయినా ఉన్నారా? అనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో గట్టిగా జరుగుతోంది. పోలీసులు ఈ విషయంలో రహస్య విచారణ చేస్తున్నారని అంటున్నారు. డీఎస్పీ స్దాయి అధికారితో పాటుగా సీఐ మీద కూడా చర్యలు తీసుకున్నారు. ఈ జరిగిన వ్యవహరం అంతటినీ మొత్తం ఆధారాలతో సహా సదరు మహిళా ఎమ్మెల్యే సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లారట.

బీసీ వర్గానికి చెందిన మహిళా ఎమ్మెల్యేని అయిన తనను, తన అనుచరుల కాల్ డేటాను బయటకు తీయటంపై ఆమె సీఎం వద్ద ఆవేదన వ్యక్తం చేశారట. దీంతో ఆమెకు సానుభూతి వచ్చేసిందని అంటున్నారు. కేబినెట్‌ లో బెర్త్‌ కోసమే కీలకమైన ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంలో ఎవరిపైనా విమర్శలు చేయకుండా వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని ఆ మధ్య ప్రచారం జరగ్గా ఇప్పుడు అదే నిజమయ్యేలా కనిపిస్తోంది. పార్టీ పెద్దలు సలహా ఇచ్చారో లేక ఇక్కడ తగ్గితే అక్కడ నెగ్గొచ్చని లెక్కలు వేసుకున్నారో కానీ ఆమె ప్రవర్తన మాత్రం ఆశ్చర్య పరుస్తోంది.