జగన్ సిమెంటు ప్లాంట్ పై రఘురామ సంచలన వ్యాఖ్యలు

ఒక్క రూపాయ విలువ చేసే షేర్ ను 100 రూపాయలకు విక్రయించి సిమెంటు ప్లాంటును జగన్ మోహన్ రెడ్డి గారు నిర్మించుకున్నారని, 2004 కు ముందు జగన్ మోహన్ రెడ్డి గారి ఆస్తులు కేవలం కోటి 90 లక్షలు మాత్రమేనని, 2009 నాటికి సిమెంటు ప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి చేశారని ఎంపి రఘురామ ఆరోపించారు. తన కంపెనీ సిమెంటును అమరావతిలో ఇళ్ళ నిర్మాణం చేసే పేదలకు విక్రయించి సొమ్ము చేసుకుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి ఆస్తి అయిన ఇసుకను మాత్రం ఫ్రీగా ఇస్తానని ప్రకటించడం సిగ్గుచేటుని అన్నారు.

అమరావతిలో ఇళ్ళ నిర్మాణం కోసం నిర్మాణ సామాగ్రిని సరఫరా చేయమంటే తమ వారే సరఫరా చేస్తారని జగన్ మోహన్ రెడ్డి గారు పేర్కొనడం విడ్డూరంగా ఉందని అన్నారు. నిర్మాణ సామాగ్రి సరఫరా నెపంతో తమ పార్టీ వారు ఎంత కమిషన్ నొక్కుతారో అందరికీ తెలిసిందేనని, టైటిల్ డీడ్ లేని ఇళ్ళ స్థలాలకు రుణాలను మంజూరీ చేస్తే, అరగంటలో ఆ బ్యాంకు చైర్మన్ ను అరెస్టు చేయిస్తానని రఘురామకృష్ణ రాజు గారు సవాల్ చేశారు. పట్టాభిషేకం అనే టైటిల్ తో సాక్షి దినపత్రికలో వార్తా కథనాలు రాసి ప్రజలను మోసగించాలని చూస్తున్నారని, అమరావతిలో నిర్వహించిన సభలో జగన్ మోహన్ రెడ్డి గారు తన సిమెంట్ కంపెనీ ప్రమోషన్ చేసుకోవడం మినహా, ఈ సభ వల్ల పేదలకు ఒరిగిందేమీ లేదని అన్నారు.

అమరావతిలో నిర్వహించిన సభకు తాటికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ని ఆహ్వానించకపోవడం సిగ్గుచేటని, గతంలో నరసాపురం నియోజకవర్గానికి ప్రధానమంత్రి గారు హాజరు అయినప్పుడు ఆ సభకు తనను ఆహ్వానించకుండా అడ్డుకున్నారని అన్నారు. జగన్ మోహన్ రె డ్డి గారికి తానంటే భయం అని… అందుకే తన రాకను అడ్డుకున్నారని అన్నారు. ప్రోటోకాల్ ప్రకారం ఒక ఎమ్మెల్యేను ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానించాలన్న బుద్ధి జిల్లా కలెక్టర్ కు లేదా?, శ్రీదేవి గారు అంటే కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి భయమేనా?? అని ప్రశ్నించారు.