జగన్ మోహన్ రెడ్డి రెండు సినిమాలు ఇప్పటికే డిజాస్టర్ అయ్యాయని, ఇప్పుడు మూడో సినిమా టైటిల్ ప్రకటించారని ఎంపీ రఘురామ సెటైర్లు పేల్చారు. గతంలో జగనన్నకు చెప్పుకుందాం రా, మా నమ్మకం నువ్వే జగనన్న అన్న రెండు సినిమాలు ప్రజల ముందు డిజాస్టర్ అయ్యాయని, ఇప్పుడు జగనన్న సురక్ష అని మూడో సినిమా టైటిల్ ప్రకటించారని, అయితే జగన్ మోహన్ రెడ్డి గారి నుంచే ప్రజలు రక్షణ కోరుకుంటున్నారని అన్నారు ఎంపీ రఘురామ.
కుప్పంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన సొంత స్థలంలో ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకుంటే అనుమతులు ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. ఇది ముఖ్యమంత్రి గారికి తెలిసే జరుగుతుందా? లేకపోతే స్థానిక మునిసిపల్ కమిషనరే పిచ్చి వేషాలు వేస్తున్నారా?? అని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. కుప్పంలోనే చంద్రబాబు నాయుడు గారిని ఇల్లు కట్టుకొనివ్వని జగన్ మోహన్ రెడ్డి గారు అమరావతిలో ఇల్లు కట్టుకుంటానంటే ఒప్పుకుంటారా? అని సందేహం వ్యక్తం చేశారు. రాయలసీమ జిల్లాలలో యువ గళం పాదయాత్ర ముగింపు సందర్భంగా బద్వేల్ లో జన సందోహం పోటెత్తిందని, అలాగే నెల్లూరు జిల్లాలో ప్రవేశించిన నారా లోకేష్ గారికి అపూర్వ స్వాగతం లభించిందని, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే వరకు జన సందోహం ఊరుకోలేదని, ఇక వారాహి యాత్ర ప్రారంభించిన పవన్ కళ్యాణ్ గారికి కత్తిపూడిలో జనం నీరాజనం పలికారని అన్నారు.